తొలిరోజే 70 శాతం 8వ తరగతి విద్యార్థులు హాజరు

23 Nov, 2020 20:01 IST|Sakshi

పాఠశాలల్లో జాగ్రత్త చర్యలు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు తొలి రోజే అత్యధిక సంఖ్యలో హాజరయ్యారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి ఇప్పటివరకు 9, 10 తరగతులు మాత్రమే పాఠశాలల్లో బోధన జరిగిందన్నారు. ‘‘సోమవారం 46.28 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 41.61 శాతం హాజరయ్యారు. అయితే తరగతులు ప్రారంభించిన తొలిరోజే 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 69.72 శాతం హాజరయ్యారు. మొత్తం 5,70,742 మంది విద్యార్థులకు 3,96,809 మంది హాజరయ్యారు. (చదవండి: అదే మా లక్ష్యం: సీఎం వైఎస్‌ జగన్)‌

గుంటూరు జిల్లాలో 82.34 శాతం అత్యధికంగా హాజరు కాగా విశాఖపట్నం జిల్లాలో తక్కువ శాతం 53.14 నమోదైంది. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 14 తరువాత 6,7 తరగతులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌ భారత్‌తోనే సాధ్యం)

మరిన్ని వార్తలు