బెయిల్‌ నిబంధనలు బేఖాతర్‌!

6 Nov, 2023 04:42 IST|Sakshi

కొందరు స్వార్థం కోసం న్యాయ వ్యవస్థను అభాసుపాల్జేస్తున్నారు  

చంద్రబాబు విషయంలోనూ అదే జరిగింది 

బెయిల్‌ మంజూరుపై జాతీయ స్థాయిలో చర్చ అవసరం 

ఏపీ ఇంటిలెక్చువల్స్‌– సిటిజన్స్‌ ఫోరం చర్చా వేదికలో న్యాయవాదులు   

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను అభాసుపాల్జేస్తున్నారని పలువురు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో కండిషనల్‌ బెయిల్‌పై వచ్చి న వ్యక్తి న్యాయస్థానం విధించిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు తప్పులు చేసి పట్టుబడినా చట్టాల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిన్నారని దుయ్యబట్టారు.

ఇందుకు చంద్రబాబు విషయమే ఉదాహరణగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు వ్యవహార శైలి– బెయిల్‌ నిబంధనల ఉల్లంఘన– శిక్షలు’ అంశంపై ఏపీ ఇంటిలెక్చువల్స్‌– సిటిజన్స్‌ ఫోరం(ఎపిక్‌) ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బెయిల్‌ మంజూరు విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో ఓ వర్గం పెత్తందారి, నియంతృత్వ పోకడలకు పోతోందని, కోర్టులను, న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు కేసులో తాము చెప్పినట్టుగా తీర్పు ఇవ్వాలంటూ  బెదిరింపులకు దిగిన తీరు ఇటీవల కోర్టులో చూశామన్నారు. తీవ్ర నేరాలు చేసిన చంద్రబాబు, రామోజీరావులు తాము చట్టాలకతీతమన్నట్టుగా వ్యవహరిస్తూ.. వాటి నుంచి తప్పించుకునేందుకు యత్ని స్తున్నారని ధ్వజమెత్తారు.   

కోర్టులను బాబు మేనేజ్‌ చేస్తున్నారు
తన రాజకీయ జీవితంలో కోర్టులను చంద్రబాబు మాత్రమే మేనేజ్‌ చేసినట్టు అనేక సందర్భాల్లో రుజువైంది. న్యాయస్థానాలు చట్ట ప్రకారం పనిచేస్తుంటే మాత్రం దు్రష్పచారం చేస్తున్నారు. చంద్రబాబు తీవ్రమైన ఆర్థిక నేరం కేసులో జైలుకు వెళితే.. తాము చేప్పినట్టు తీర్పు ఇవ్వలేదని ఆయన వర్గం వారు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. చివరికి బెయిల్‌ రాకపోయేసరికి ‘అనారోగ్యం’ సాకుగా చూపారు. కోర్టు కండిషన్లు పెట్టి బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికొచ్చాక ఆస్పత్రికో, ఇంటికో వెళ్లాల్సి చంద్రబాబు.. 14 గంటల పాటు ర్యాలీ చేశారు. ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించడమే.     – విజయ్‌బాబు, ఎపిక్‌ ఫోరం వ్యవస్థాపకుడు 

ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణే 
చంద్రబాబు కేసులో దాదాపు 53 రోజులు దేశంలో ప్రముఖ న్యాయవాదులు కేసును వాదించారు.  చివరికి ‘వైద్యం’ పేరుతో అబద్ధం చెప్పి బెయిల్‌ తీసుకుని రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణ. ఆయన బెయిల్‌ రద్దు చేయాలి. లేకుంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇలాగే బయటకొచ్చే అవకాశం ఉంది.  – పిళ్లా రవి, న్యాయవాది 

న్యాయ వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయో పురందేశ్వరి చెప్పాలి   
పురందేశ్వరి, టీడీపీ నాయకులు న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వారు బెయిళ్లు తెచ్చుకున్నప్పుడు.. ఇప్పుడు అవే చట్టాలు. తనకు అనుకూలంగా బెయిళ్లు వచ్చినప్పుడు చట్టం తనపని చేసుకుపోతుందన్నారు, ఇప్పుడేమో మేనేజ్‌ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు ఆరి్థక నేరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. న్యాయ వ్యవస్థలో ఏం లోపాలున్నాయో పురందేశ్వరి చెప్పాలి.   – విఠల్‌రావు, న్యాయవాది 

బెయిల్‌ నిబంధనలపై చర్చ అవసరం  
దేశంలో రూల్‌ ఆఫ్‌ లా సరిగా అమలు కావడం లేదు. ఏదైనా కేసులో అండర్‌ ట్రైల్‌ కింద జైలుకు వెళ్లిన వారు బెయిల్‌ కోసం అప్లై చేసుకోవడం వారి హక్కు. కానీ ఇక్కడ అందరికీ ఈ హక్కు లభించడం లేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకునేవారికి, ఆర్థికంగా శక్తిమంతమైన వారికి సులభంగా బెయిల్‌ వచ్చేస్తోంది. కానీ చాలామంది సామాన్యులు అండర్‌ ట్రైల్‌లోనే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయాలి. ప్రభుత్వంలో ఉండి ఆరి్థక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్‌ ఇవ్వకూడదు.      – కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
 

పురందేశ్వరి టీడీపీలో పదవి ఆశిస్తున్నట్టున్నారు.. 
చంద్రబాబు సీఎంగా 2014–­19 మధ్య చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఇప్పు­డు దొరికిపోయాక అరెస్టు నుంచి బెయిల్‌ వరకు చట్టాలను ఉ­ల్లంఘించారు. చివరికి న్యాయమూర్తులపైనా ఆరో­పణలు చేస్తున్నారు. మెడికల్‌ కండిషన్‌పై బెయిల్‌ తెచ్చుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పురందేశ్వరికి ఇవన్నీ కనిపించడం లేదా? ఆమె బీజేపీ పదవి కంటే టీడీపీ పదవి ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది.   – సాయిరామ్, అడ్వకేట్‌ 

వారికి చట్టాలంటే గౌరవం లేదు  
ఒకరు నేరం చేశారని కేసు నమోదైతే కింది కోర్టులో తీర్పు వెలువడ్డాక పైకోర్టులకు వెళతారు. కానీ చంద్రబాబు కేసు­లో మాత్రం అందుకు విరుద్ధం. చేసిన నేరం నుంచి బయటపడేందుకు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారంటే జరిగింది ఎంత పెద్ద నేరమో అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యవస్థను ఎలా మేనేజ్‌ చేయాలో తెలిసినవారే ఇలా చేస్తారు. ఈ కేసులో చంద్రబాబు వర్గానికి చట్టాలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై గౌ­రవం లేదు. యథేచ్ఛగా చట్టాలను ఉల్లఘించారు.     – నరహరిశెట్టి శ్రీహరి, హైకోర్టు న్యాయవాది 

బాబుకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివయ్యాయి..  
సామాన్యులు బెయిల్‌ రాకుండా అండర్‌ ట్రైల్‌లోనే ఉండిపోతున్నారు. కానీ చంద్రబాబు, రామోజీరావులు కోర్టు మెట్లు ఎక్కకుండానే బెయిల్‌ తెచ్చుకుంటున్నారు. స్కిల్‌ స్కాం తప్ప మరే కేసులోను బాబు కోర్టుకు, జైలుకు వెళ్లింది లేదు. తనకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివే అన్నారు, ఈ ఒక్క కేసులో బెయిల్‌ రాకపోయేసరికి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్‌ నిబంధనలపై న్యాయ సమీక్ష అవసరం   – ధనలక్ష్మి, న్యాయవాది 

అబద్ధాలు చెప్పి బయటికొచ్చారు  
చంద్రబాబుకు వైద్యం కోసం కోర్టు బెయిల్‌ ఇచ్చి ంది. బయట ప్రసంగాలు చేయొద్దని చెప్పింది. కానీ బాబు మాత్రం తన హక్కును కాపాడిన కోర్టు హక్కులనూ కాలరాశారు. అబద్ధం చెప్పి బయటకు వచ్చి ర్యాలీలు చేశారు.    – ఎన్‌.జ్యోతి, న్యాయవాది 

రోజుకో రోగమని చెప్పారు.. 
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోజుకో రోగమని చెప్పారు. వైద్యం కోసం బెయిల్‌ తెచ్చుకుని బయటికి రాగానే ర్యాలీలు చేశారు. బాబు అరెస్ట్‌ సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం.  – జె.జయలక్ష్మి, న్యాయవాది 

ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు గమనించాలి 
చంద్రబాబు అన్ని రకాల బెయిళ్లకు అప్లై చేసి, ఏదీ రాకపోయేసరికి ‘అనారోగ్యాన్ని’ అడ్డుపెట్టుకుని బయటపడ్డారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రికి వెళ్లాల్సింది పోయి.. రాజకీయ ర్యాలీలు చేశారు. న్యాయస్థానాలు ఇలాంటివి గమనించాలి.   – ఉషాజ్యోతి, న్యాయవాది 

మరిన్ని వార్తలు