ఆ యాత్ర ఉద్దేశమే వేరు

29 Oct, 2022 08:48 IST|Sakshi

అమరావతి రైతులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు

తొడలు కొడుతూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు

అందువల్ల వారి యాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌

సాక్షి, అమరావతి: అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ పాదయాత్ర చేపట్టిన రైతులు.. ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ, వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విధించిన షరతులను అమరావతి రైతులు ఉల్లంఘిస్తున్నందున వారి యాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. యాత్రలో 600 మంది రైతులు మాత్రమే ఉండాలని, సంఘీభావం పేరుతో ఇతరులెవ్వరూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదంటూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు శుక్రవారం విచారణ జరిపారు. 

అది ముమ్మాటికీ రాజకీయ యాత్రే
పోలీసుల తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘యాత్రలో పాల్గొనే 600 మంది రైతులకు పోలీసులు గుర్తింపు కార్డులు సిద్ధం చేశారు. వాటిని జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అయితే కొద్ది మంది మాత్రమే గుర్తింపు కార్డులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు చూపాలని పోలీసులు అడిగితే, కోర్టు విధించిన షరతులను సడలించాలని వారు అడుగుతున్నారు.

యాత్ర వెంట నాలుగు వాహనాలకు బదులుగా 200 వాహనాలు వెంట ఉన్నాయి. అసలు అమరావతి రైతులు తలపెట్టిన యాత్ర ఉద్దేశమే వేరు. ఇటీవల గుడివాడలో అక్కడి ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి.. గుడివాడ వచ్చాం.. తేల్చుకుందాం రా అంటూ తొడలు కొడుతూ తీవ్రంగా రెచ్చగొట్టారు. వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదు. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పి రాజకీయ యాత్రగా మార్చేశారు. అందువల్ల అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి’ అని ఆయన కోర్టును అభ్యర్థించారు. 

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నారు..
మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, ఆర్‌.ఎన్‌.హేమేంద్రనాథ్‌రెడ్డి, చిత్తరవు రఘు, వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. కొందరు రైతులు న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, టీవీల్లో చర్చలు పెట్టడం చేస్తున్నారని తెలిపారు. మంత్రులపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్‌ రూపంలో సమాధానం ఇస్తామన్నారు.

రైతుల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సంఘీభావం పేరుతో యాత్రలో ఇతరులు పాల్గొనడానికి వీల్లేదన్న ఆదేశాలు యాత్రలో పాల్గొనాలనుకుంటున్న వారి హక్కులను హరించేలా ఉన్నాయన్నారు. గుర్తింపు కార్డులు పొందిన వారే కాకుండా ఇతరులు కూడా యాత్రలో పాల్గొంటారని, రొటేషన్‌ పద్దతిలో యాత్రను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

అవేం మాటలు?
రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఉపయోగించిన భాషపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్నది జంతువుల్లా అలా నడుచుకుంటూ వెళ్లడానికి కాదంటూ పిటిషన్‌లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును శాసించేలా పదజాలం ఉపయోగించడంపై కూడా మండిపడ్డారు. దీంతో రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు క్షమాపణలు కోరారు. 

మరిన్ని వార్తలు