టోఫెల్‌ తర్ఫీదుకు కీలక అడుగు!

28 Oct, 2023 02:51 IST|Sakshi

‘లిక్విడ్‌ ఇంగ్లిష్‌ ఎడ్జ్‌’తో ఒప్పందం

అంతర్జాతీయ స్థాయి మెటీరియల్‌ 

ఈ విద్యా సంవత్సరానికి ఉచితంగా సేవలందించనున్న ‘లిక్విడ్‌’   

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ‘టోఫెల్‌ సర్టిఫికేషన్‌’కు సన్నద్ధం చేయడంలో భా­గంగా ‘లిక్విడ్‌ ఇంగ్లిష్‌ ఎడ్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి టోఫెల్‌ శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్, ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందించడంతో పా­టు, ఉపాధ్యాయులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వ­­నుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చా­రు. ఇప్పటికే మూడో తరగతి నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్‌ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు.

విద్యార్థుల్లో లిజనింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాల పెంపు, వివిధ దేశాల్లో ఇంగ్లిషు మాట్లాడే తీరును అర్థం చేసుకుని.. తిరిగి జవాబు ఇచ్చేలా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్‌సీఈఆర్టీ ద్వా­రా మెటీరియల్‌ తయారు చేశామన్నారు. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్‌ ఏజెన్సీ మెటీరియల్‌ అవసరాన్ని గుర్తించి లిక్విడ్‌ ఇంగ్లిష్‌ ఎడ్జ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకు­ని లిక్విడ్‌ సంస్థ ఉచితంగా మెటీరియల్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు.

ఈ ప్రాజెక్టుకు సమగ్ర శిక్ష పీడీ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. వాస్తవానికి టోఫెల్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్విసెస్‌(ఈటీఎస్‌)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. విద్యార్థులను టోఫెల్‌ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి­న సంస్థల నుంచి టెండర్లు పిలిచినా.. శిక్షణ ప్రక్రియ ప్రారంభించేందుకు సమయం లేదన్నారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే లిక్విడ్‌ ఇచ్చే కంటెంట్‌ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది టెండర్లు పిలిచి కంటెంట్‌ ఖరారు చేస్తామని వివరించారు.  
 
తరగతి గదుల డిజిటలైజేషన్‌ 
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రవీణ్‌ప్రకాశ్‌ చెప్పారు. ఇందులో భాగంగానే 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది ఆంగ్ల మాధ్యమం అభ్యసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సైన్స్, సోషల్‌ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన సా­మర్థ్యం పెంపొందించడంలో భాగంగా బైజూస్‌ ద్వా­­రా ఉత్తమ కంటెంట్‌ అందిస్తోందన్నారు.

ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుల­కు బై­జూస్‌ కంటెంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసి 5.18 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసిందని వెల్లడించారు. నాడు­–­నేడు­లో భాగంగా పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టి­వ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్‌ టీవీలతో తరగతి గదులను డిజిటలైజ్‌ చేసిందని చెప్పారు. డిసెంబర్‌ నాటికి మొత్తం తరగతి గదుల్లో హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌తో డిజిటల్‌ బోధ­నలు ప్రవేశపెడతామని వివరించారు.   

అంతర్జాతీయంగా గుర్తింపు 
నోయిడాకు చెందిన లిక్విడ్‌ ఇంగ్లిష్‌ ఎడ్జ్‌.. కామన్‌ యూరోపియన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(సీఇఎఫ్‌ఆర్‌)తో పాటు బ్రిటీష్‌ కౌన్సిల్, పియర్సన్, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రెస్, మాక్మిలన్, ఆదిత్య బిర్లా  ఫౌండేషన్, పబ్లిషింగ్‌ కంపెనీలకు విశ్వసనీయ సేవలందిస్తోంది. విద్యార్థుల తరగతి, వయస్సును బట్టి ఈ కంటెంట్‌ను తయారు చేసి అందిస్తోంది. కెయిర్న్‌ ఇండియా, అలహాబాద్‌ యూనివర్సిటీ, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ఫౌండేషన్, ఫ్రాంక్ఫిన్, గ్లోబల్‌ లాజిక్, ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, జెట్కింగ్, ఒడిశా మోడల్‌ ట్రైబల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వంటి అనేక మందికి సేవలందిస్తోంది.

మరిన్ని వార్తలు