ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి

11 May, 2022 04:49 IST|Sakshi

ప్రశ్నపత్రాల లీకేజీలో ఆధారాలు లభించడం వల్లే 

మాజీ మంత్రి నారాయణ అరెస్టు

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. మంగళవారం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం, డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీలతో డిజైన్లను వీలైనంత తొందరగా ఆమోదింపజేసుకుని పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు.

ఆ ప్రాజెక్టుకు ఖర్చుచేసిన రూ.2,559.37 కోట్లను రీయింబర్స్‌ చేసేలా కేంద్ర అధికారులతో చర్చించాలని ఆదేశించారన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయ్యేదశకు చేరుకున్నాయని, వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలు లభించడం వల్లే మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను పోలీసులు అరెస్టు చేశారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు మాత్రం గందరగోళం చేస్తున్నారని విమర్శించారు.

లీక్‌ చేసేది వాళ్లే.. గందరగోళం చేసేది వాళ్లే.. అంటూ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, టీడీపీ నేతల మాటలను విశ్వసించరని చెప్పారు. ‘పేపర్‌ లీక్‌ చేసేది టీడీపీ నేతలు.. రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణా?’ అని మరో ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు