Cyclone Asani: సర్కారు హై అలర్ట్‌

11 May, 2022 04:37 IST|Sakshi
అసని తుపాను గమనం ఇలా..

6 జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ముందస్తు సహాయక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం

స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ద్వారా 24 గంటలూ పర్యవేక్షణ

మండల, గ్రామ స్థాయిలో ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు 

రెవెన్యూ శాఖ కార్యదర్శితో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, అమరావతి: తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.

మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు, 219 మల్టీపర్పస్‌ సైక్లోన్‌ సెంటర్లు, 16 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను క్రియాశీలకం చేశారు. 

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 16 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్‌ఎఫ్, 2 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందస్తుగా పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్‌ఎఫ్, 2 ఎస్డీఆర్‌ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్‌ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్‌ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని పంపించారు.

మిగిలిన బృందాలను అవసరమైన చోటుకు పంపేందుకు అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సహాయక శిబిరాలను కూడా గుర్తించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ప్రాంతాల వారీగా తయారు చేశారు.

టెలీ కమ్యూనికేషన్లు, తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్లియర్‌ చేయడానికి ముందస్తు ప్రణాళికలను జిల్లా యంత్రాంగాలు సిద్ధం చేసుకున్నాయి. తాత్కాలిక విద్యుత్‌ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్‌ శాఖను ఆదేశించారు. ఇదిలావుండగా.. తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని కలెక్టర్‌ ఎ.మల్లికార్జునరావుకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
విశాఖలోని  ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద అలల ఉధృతి 

గ్రామాల వారీగా కమిటీలు
తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీరాజ్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌ శాంతిప్రియపాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 

హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ 
తుపాను ప్రభావిత రాష్ట్రాల విపత్తుల శాఖ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పాల్గొన్నారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ముందస్తుగా తీసుకున్న చర్యలను వివరించారు.  

మరిన్ని వార్తలు