జూన్‌కల్లా ఆనందపురం–అనకాపల్లి హైవే సిద్ధం

10 Feb, 2022 04:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆనందపురం–పెందుర్తి–అనకాపల్లి మధ్య నిర్మిస్తున్న ఆరులేన్ల జాతీయ రహదారి జూన్‌కల్లా పూర్తవుతుందని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రూ.2,527 కోట్లతో సుమారు 50 కిలోమీటర్ల మేర 2019 ఏప్రిల్‌లో ఈ రహదారి నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ నిర్మాణం గత జూలై నాటికి పూర్తికావాల్సి ఉన్నా కోవిడ్‌ కారణంగా జాప్యం జరిగిందన్నారు. దీనివల్ల ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశం లేదని చెప్పారు.

విభజన హామీల అమలుకు 26 సమావేశాలు
రాష్ట్ర విభజన చట్టం హామీల అమలుకు సంబంధించి 26 సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. విభజన చట్టంలోని చాలా ప్రొవిజన్లు అమల్లో ఉన్నాయని, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని చెప్పారు. ఆయా సంస్థల ఏర్పాటు, ప్రాజెక్టుల పూర్తికి చట్టంలో పదేళ్ల సమయం ఉందని, వీటి పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు.
  
వైఎస్సార్‌ చేయూత తరహా పథకం లేదు
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు (45–60) ఆర్థిక భరోసా కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ చేయూత తరహా పథకం కేంద్రంలో లేదని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.  

>
మరిన్ని వార్తలు