అది తప్పుడు వార్త

23 Aug, 2022 05:11 IST|Sakshi

విద్యా దీవెన, వసతి దీవెనల కింద ప్రభుత్వం పూర్తి మొత్తం ఇచ్చింది

అవనిగడ్డ విద్యార్థిని తల్లి లత స్పష్టీకరణ

లత, ఆమె కుటుంబీకుల అకౌంట్లలో రూ.1.72 లక్షలు జమ

ఏఏ తేదీలో ఎంత జమయ్యాయో వివరించిన అధికారులు

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సీతాయిలంకలోని తుమాటి లత అనే మహిళ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల నిధులు పూర్తిగా అందలేదని ఎమ్మేల్యే సింహాద్రి రమేష్‌బాబును గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీసినట్లు ఆ పత్రిక సోమవారం ఒక వార్త ప్రచురించింది. ఆ కార్యక్రమంలో జరిగిన దానికి భిన్నంగా తప్పుడు సమాచారాన్ని వండి వార్చింది.

వాస్తవానికి తుమాటి లత బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ. 1.72 లక్షలు జమ చేసినట్లు పేర్కొంటూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమెకు కరపత్రాన్ని అందించారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ. 1.40 లక్షల వరకు అందినట్లు, బ్యాంకు అకౌంట్‌ పుస్తకంలో ఆమేరకు జమ చేసినట్లు అందులో వివరించారు. అయితే ఈ రెండు పథకాల కింద తమకు రూ.82 వేలు మాత్రమే అందినట్లు లత చెప్పడంతో ఆమెకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే 1.72 లక్షల నిధులు లత, ఆమె కుటుంబీకులకు చెందిన ఏయే  బ్యాంకు అకౌంట్లలోకి ఏ తేదీల్లో జమ అయ్యాయో వివరంగా చూపించారు.

అలాగే  విద్యా దీవెన, వసతి దీవెన కింద  1.40 లక్షలు ఏయే తేదీల్లో జమ అయ్యాయో రికార్డులు చూపి మరీ చెప్పారు. తన అకౌంట్లో, తన కుమార్తె అకౌంట్లో మొత్తం నిధులు జమ అయ్యాయని, తానే పొరపాటున పూర్తిగా రాలేదని అనుకున్నానని లత వివరించారు. పూర్తి మొత్తం అందించినట్లు బ్యాంకు అకౌంట్లలో జమ అయిన మొత్తాలను చూపి మరీ అధికారులు తమకు వివరించారని చెప్పారు. అయితే, ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్త రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు