ఇదో అదృష్టం

1 Dec, 2023 04:47 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌కు మెడలో షేలా, ఇలాచి వేసి పేటా అలంకరణ చేస్తున్న దర్గా పీఠాధిపతులు

కడప పెద్ద దర్గాలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రార్థనలు 

సాక్షి ప్రతినిధి, కడప: మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న కడప అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయిందని, ఇది తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ గురువారం మధ్యాహ్నం కడప అమీన్‌పీర్‌ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్‌ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేయర్‌ కె.సురేష్బాబు, జిల్లా కలెక్టర్‌ వి.విజయ్‌రామరాజు, జాయింట్‌ కలెక్టర్‌ గణేష్కుమార్, కడప నగర పాలక సంస్థ కమిషనర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఐకమత్యతతో దర్గా ఖ్యాతి, మహిమలు, ప్రపంచవ్యాప్తంగా పరిమళిస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

తాను పుట్టి పెరిగిన జిల్లాలో ఇంత మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమీన్‌పీర్‌ దర్గాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదరిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీల సేవలో తరిస్తున్న మిత్రుడు ఎస్‌బీ అంజద్‌బాషాకు అభినందనలు తెలి­యజేస్తున్నట్లు చెప్పారు.  

సంప్రదాయ పేటా, షేలా ధరించి.. 
కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన అమీన్‌పీర్‌ దర్గా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు దర్గా ప్రతినిధులు సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిని ముందుగా పెద్ద దర్గా ప్రధాన మందిరంలోకి పీఠాధి­పతి ఆరిఫుల్లా హుస్సేని, దర్గా కమిటీ సభ్యులు సాదరంగా ఆహా్వనించారు. దర్గా సేవలో నిరంతరం నిమగ్నమైన ముజావర్లు, కమిటీ సభ్యులు, చౌదరీ కలీఫాలను దర్గా పీఠాధిపతులు హజరత్‌ ఖాజా సయ్యద్‌ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.

దర్గా పీఠాధిపతులచే ‘సూఫీ సర్మాస్త్‌ సానీ షిలాక్‌‘ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరించి మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) ధరింపజేశారు. అనంతరం పీఠాధిపతులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ అమీన్‌పీర్‌ దర్గా గుమ్మం వద్దకు చేరుకుని నారికేళి రాతిపై కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమ­ర్పించుకున్నారు. ముజావర్లు అందించిన పూలు, వస్త్ర చాదర్, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని భక్తి పారవశ్యంతో ప్రధాన దర్గా లోపలికి ప్రవేశించారు.

అక్కడ పీరుల్లా మాలిక్‌ జీవ సమాధి వద్ద చాదర్, పూలమాల, అత్తరు సమర్పించిన అనంతరం ఫాతెహ నిర్వహించి ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా అరీఫుల్లా మాలిక్, అమీన్‌ స్వామి మొదలైన 16 మంది పూర్వపు పీఠాధిపతుల మజార్ల వద్దకు చేరుకుని గంధం, చాదర్, పూలు సమర్పించారు. పూర్వ పీఠాధిపతుల మజార్లకు పూలు సమర్పించి గురువులతో ప్రార్థనలు చేశారు.

అమీన్‌పీర్‌ దర్గా గ్రంథాలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా విశిష్టత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని పీఠాధిపతి వివరించారు. దర్గా మేనేజర్‌ ఎస్‌ఎండీ అలీఖాన్, ముజూవర్‌ అమీర్, దర్గా కో ఆర్డినేటర్‌ కుతుబుద్దీన్, హజ్‌ హౌస్‌ చైర్మన్‌ గౌసుల్లాజం, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్, వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కరీముల్లా, స్టేట్‌ మైనారిటీ కమిషన్‌ మెంబర్‌ హిదయతుల్లా, వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌ సోహేల్, అఫ్జల్‌ఖాన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ ఆధ్వర్యంలో అమీన్‌పీర్‌ దర్గా ప్రాంగణం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.  

ఘన స్వాగతం  
పెద్దదర్గాను దర్శించుకునేందుకు నంద్యాల నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్‌ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్‌్థకౌశల్, ఎంపీ వైఎస్‌ అవినాష్రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేయర్‌ కె.సురేష్బాబు, శాసన మండలి వైస్‌ చైర్మన్‌ జకియాఖానం, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సి.రామచంద్రయ్య, ఎం.రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, దాసరి సుధ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, మూలే సుదీర్‌రెడ్డి, నవాజ్‌బాషా తదితరులు స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, టీటీడీ మాజీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి హెలికాఫ్టర్‌లో కడప చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు