ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌ వన్‌

5 Sep, 2020 16:48 IST|Sakshi

సాక్షి, అమరావతి/ ఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఓవరాల్‌ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వ పనితీరుకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ రేటింగ్‌ అద్దం పడుతోంది. ఇక ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి.

ఈ మేరకు 2020 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. పెరిగిన పారదర్శకత, మెరుగైన పనితీరుకు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లు అద్దం పట్టాయని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. తొలిమూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలకు నిర్మల అభినందనలు తెలిపారు. గత సర్వే ల కంటే భిన్నంగా ఈ సారి సర్వే నిర్వహించారు. తొలిసారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా.. ఇదే అసలైన ర్యాంకింగ్ ప్రక్రియగా పారిశ్రామికవేత్తలుఅభి ప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకటించేవారు. ఈసారి పారిశ్రామిక వేత్తలు సర్వే నిర్వహించగా.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు. అన్నింటినీ అమలు చేసినందున నూటికి నూరు శాతం మార్కులు పొందటంతో మొదటిస్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు