అనూహ్య ‘అసని’

11 May, 2022 04:24 IST|Sakshi
కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర కెరటాలతో దెబ్బతిన్న వంతెన

ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటున్న అతి తీవ్ర తుపాను

నేటి ఉదయం మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే చాన్స్‌

సముద్రంలోనే తీవ్ర తుపానుగా బలహీనపడనున్న అసని

అనంతరం కాకినాడ మీదుగా విశాఖ వైపు పయనం

నేడు ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు

నేటి ఇంటర్‌ పరీక్ష 25కు వాయిదా

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: వాతావరణ శాఖ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ..  అనూహ్యంగా అటూఇటూ ప్రయాణిస్తోంది ‘అసని’ తీవ్ర తుపాను. రోజుకో దిశలో.. పూటకో వేగంతో కదులుతోంది. విశాఖ తీరానికి సమీపించి.. ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కి.మీ. వేగంతో ప్రయాణించి.. దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది.

మంగళవారం రాత్రి 11.15 గంటల సమయానికి కాకినాడకు 170 కి.మీ., విశాఖకు  290 కి.మీ., గోపాలపూర్‌కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం ఉదయానికి మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి సముద్రంలోకి వెళ్తుందని.. అక్కడి నుంచి మరింత బలహీనపడి కాకినాడ మీదుగా విశాఖపట్నం తీరం వైపు వస్తుందని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి తుపానుగా.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది.

ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సుమారు 25 సెం.మీ. మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి.
కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర కెరటాల ఉధృతికి కూలిపోతున్న మత్స్యకారుల ఇళ్లు   

75–85 కి.మీ. వేగంతో గాలులు
బుధవారం ఉదయం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ., గరిష్టంగా 75 కి.మీ. వేగంతోనూ మధ్యాహ్న సమయంలో గంటకు 75 నుంచి 85 కిమీ, గరిష్టంగా 95 కి.మీ. వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. కాకినాడ, విశాఖపట్నం, భీమిలి, గంగవరం పోర్టుల్లో గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌–10 (జీడీ–10), మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో జీడీ–8 హెచ్చరికలు జారీ చేశారు.

సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం
తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతంలోని నౌకాదళ సిబ్బంది, అధికారులకు విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 19 వరద సహాయక బృందాలు, 6 డైవింగ్‌ టీమ్‌లు, జెమినీ బోట్లని విశాఖలో సిద్ధం చేశారు. 

తిరుపతి జిల్లాలో భారీ వర్షం
తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓజిలి మండలం ఇనుగుంటలో 13.6 సెం.మీ. వర్షం కురిసింది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో 11.2 సెం.మీ., ఖాజీపేట మండలం ఎట్టూరులో 10.7, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 8.1, విశాఖలో 5.9, నెల్లూరు జిల్లా కావలి, గుడ్లూరు మండలం రావూరులో 5 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా ఉమ్మడి కోస్తాంధ్ర అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోనసీమ, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 3.1 మి.మీ. వర్షం పడింది.

5 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ 
రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

68 విమానాలు రద్దు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/మధురపూడి: తుపాను కారణంగా విశాఖ విమానాశ్రయంలో  మొత్తం 68 సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇండిగో విమాన సర్వీసులు 46, ఎయిర్‌ ఏసియా విమాన సర్వీసులు 4, ఎయిరిండియా విమాన సర్వీసులు 2 రద్దయ్యాయి. స్పైజ్‌జెట్‌ సర్వీసు కూడా రద్దయ్యింది. బుధవారం కూడా ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంగళవారం రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

కాకినాడ బీచ్‌ రోడ్డు మూసివేత
కాకినాడ సిటీ/విడవలూరు (నెల్లూరు): తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండంతో విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. కాకినాడ తీరంలో సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్‌ రోడ్డును మూసివేశారు.

ఉప్పాడ తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. సమీపంలోని ఇళ్లల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్‌ రోడ్డు ధ్వంసమయ్యాయి. కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. మండలంలోని రామతీర్థం పరిసర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో 5 అడుగుల మేర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 150 మీటర్లు మేర ముందుకొచ్చింది.  

మరిన్ని వార్తలు