Andhra Pradesh: తాగినంత నీరు..

19 Feb, 2022 03:56 IST|Sakshi

గ్రామాల దాహార్తి తీరేలా ప్రణాళిక

రూ.17,989 కోట్లతో వచ్చే రెండేళ్లకు సిద్ధం

పల్లెల్లో నిరుపయోగంగా మంచినీటి పథకాలు 

ట్యాంకులు, ఫిల్టర్‌ బెడ్, పైపు లైన్లున్నానీటి సదుపాయం లేని దుస్థితి

ఇక అన్ని గ్రామాల్లో దశలవారీగా సమస్యల పరిష్కారం.. జగనన్న కాలనీల్లో మంచినీటి సౌకర్యాలకు ప్రాధాన్యం

తొలుత 9 జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌ పనులు

సాక్షి, అమరావతి: గ్రామాల్లో మంచినీటి సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని ప్రాంతాలకు సంతృప్త స్థాయిలో రక్షిత మంచినీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో గ్రామంలో ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం 55 లీటర్ల చొప్పున ఇంటి వద్దే కొళాయి ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. వచ్చే రెండేళ్లలో 2024 మార్చి నెలాఖరు వరకు గ్రామాల్లో రక్షిత మంచినీటి వసతుల కోసం రూ.17,989.32 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌
డబ్ల్యూఎస్‌) తయారు చేసిన నివేదికను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.

ఇప్పటికే గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలున్నా నీటి సదుపాయం లేక  వృథాగా ఉన్న చోట్ల శ్వాశత నీటి వసతి కల్పనకు రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లు, నదుల నుంచి ఏడాది పొడవునా కాల్వల ద్వారా రక్షిత మంచినీటి పథకాలకు నీళ్లు అందజేసే అవకాశం ఉన్న చోట అందుకనుగుణంగా చర్యలు చేపడతారు. అలా వీలుకాని చోట్ల మంచినీటి పథకాలకు అనుబంధంగా కొత్తగా బోర్లు తవ్వి క్లోరినేషన్‌ చేసి రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారు. మొత్తం 56,448 పనులకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు.

 2,935 పంచాయతీల్లో 100 %
రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం వీటిని 48,488 నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.16 లక్షల ఇళ్లు ఉండగా 49.46 లక్షల ఇళ్లకు (51.97 శాతం) ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటికీ కొళాయి సదుపాయాన్ని కల్పించింది. గత రెండేళ్లలో కొత్తగా 18.72 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. 2,935 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇళ్లకు ఇప్పుడు కొళాయిల ద్వారానే ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది.

  జల్‌ జీవన్‌తో..
జల్‌ జీవన్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో రూ.3,090 కోట్ల వ్యయంతో 12,529 నివాసిత ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు కొత్తగా కుళాయిల ఏర్పాటుతో పాటు రోజూ నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. 

జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు
ఇళ్లు లేని పేదల కోసం ప్రభుత్వం జగనన్న హౌసింగ్‌ కాలనీలను ప్రత్యేకంగా నిర్మించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో కొత్తగా ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణంతో పాటు రక్షిత మంచినీటి పథకాల కోసం రెండేళ్లలో రూ.3,250 కోట్లు వ్యయం చేయనున్నారు. 

తీవ్ర సమస్యలున్న చోట్ల తొలుత..
వచ్చే 35 ఏళ్లలో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంత మంచినీటి అవసరాలతో పాటు పారిశ్రామిక వినియోగాన్ని కూడా కలిపి రూ.50 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తీవ్ర తాగునీటి సమస్యలున్న చోట్ల పనులను తొలుత ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తీరంలో ఉప్పునీటి కష్టాలు తీరేలా...
ఉభయ గోదావరి జిల్లాల్లో సముద్ర తీరం వెంట ఉప్పనీటి కారణంగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల్లో రూ.3,050 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పనులను రెండేళ్లలో చేపట్టనున్నారు. రూ.1,650 కోట్లు తూర్పు గోదావరిలో, రూ.1,400 కోట్లు పశ్చిమ గోదావరిలో ఖర్చు చేస్తారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో శ్వాశత రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తారు.  చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,550 కోట్లతో పనులు చేపడతారు.  గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మంచినీటి కష్టాల పరిష్కారానికి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రూ.1,200 కోట్లతో శాశ్వత రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మంచినీటి సౌకర్యాల కల్పనకు రూ.750 కోట్లు కేటాయించారు. 

ఉద్దానం, పులివెందుల, డోన్‌లో ఇప్పటికే..
రూ.700 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో, రూ.460 కోట్లతో వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో, రూ.224.32 కోట్లతో కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గ పరిధిలో వాటర్‌ గ్రిడ్‌ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. 

నీటి పరీక్షలు, నిర్వహణకు రూ.425 కోట్లు
రక్షిత మంచినీటి పథకాల ద్వారా రాష్ట్రమంతటా బోరు బావి నీటి నాణ్యత పరీక్ష,  నిర్వహణ ఖర్చులకు రూ.425 కోట్లు కేటాయించారు. 

20 ఏళ్లుగా... వృథాగా
గుంటూరు జిల్లా రొంపిచర్లలో రెండు దశాబ్దాల క్రితం రూ.1.20 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంకు, ఫిల్టర్‌ బెడ్‌ అన్నీ ఉన్నా నీటి వసతే లేక నిరుపయోగంగా మిగిలిపోయింది. గ్రామంలోని బోర్లు, బావుల్లో తగినంత నీరు లేకపోవడం, ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్లపై ఆధారపడడంతో తాగునీటి పథకం మూలన పడింది. 

మరిన్ని వార్తలు