ఏపీ పోలీస్‌ భేష్‌.. చార్జిషీట్ల దాఖలులో నంబర్‌ వన్‌

17 Jan, 2022 05:37 IST|Sakshi

ఏపీలో మరింత బలోపేతమైన పోలీస్‌ వ్యవస్థ 

చార్జిషీట్ల దాఖలులో ఏపీ నంబర్‌ వన్‌  

నేరం చేస్తే దండనే 

పెరిగిన మహిళా పోలీసులు  

కేంద్ర గుడ్‌ గవర్నెన్స్‌ నివేదిక వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ మరింతగా బలోపేతమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానంగా దోషులకు శిక్షలు పడేలా సమర్థ దర్యాప్తు, మహిళా పోలీసుల ప్రాతినిధ్యం పెరగడం సానుకూల పరిణామమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గుడ్‌ గవర్నెన్స్‌–2021’ నివేదిక జ్యుడిషియరీ–పబ్లిక్‌ సెక్యూరిటీ అనే అంశం కింద వివిధ రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ ఎలా ఉందనే విషయాలను విశ్లేషించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో మన రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరిచిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. దోషులకు సత్వరం శిక్షలు విధించడం, జనాభాను బట్టి పోలీసు అధికారులు– సిబ్బంది నిష్పత్తి, ప్రత్యేకంగా మహిళా పోలీసుల నిష్పత్తి, కేసుల పరిష్కార తీరు అనే నాలుగు ప్రామాణిక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించింది.
– సాక్షి, అమరావతి 

సత్వర శిక్షల దిశగా ముందుకు.. 
వివిధ రకాల నేరాలకు పాల్పడిన దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్‌ సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. 2019–20లో 26.10 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించారు. కాగా 2020–21లో 38.40 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పోలీస్‌ అధికారులు నిర్ణీత కాలంలో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, చార్జిషీట్లను దాఖలు చేయడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతోనే ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రత్యేకంగా పోక్సో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం ద్వారా కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంది. 2020–21లో శిక్షలు పడిన రేటు 12.30 శాతం పెరిగింది. 

జనాభాకు అనుగుణంగా నియామకాల్లోనూ పురోగతి 
జనాభా నిష్పత్తికి అనుగుణంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది నియామకం విషయంలోనూ మన రాష్ట్రం పురోగతి సాధించింది. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 15 వేల మంది మహిళా పోలీసులను నియమించడం ఇందుకు బాగా దోహదపడింది. 2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసుల సంఖ్య 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగింది. పోలీసుల సంఖ్య పెరుగుదల 1.68 శాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు