నీటి లెక్కలు తేలాకే ‘నవలి’పై చర్చిద్దాం 

23 Oct, 2020 08:26 IST|Sakshi

బోర్డు పరిధిలో పనులకు రివర్స్‌ టెండర్లు: చైర్మన్‌ రంగారెడ్డి

సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన కర్ణాటకలో కొప్పళ జిల్లా నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించాలన్న ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. కర్ణాటక సర్కారు ఇప్పటికే ఎగువన తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటి కంటే అధికంగా మళ్లిస్తుండటం వల్ల తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గుతోందని స్పష్టం చేసింది. కర్ణాటక అధికంగా తరలిస్తున్న నీటిని లెక్కించాకే నవలి రిజర్వాయర్‌పై చర్చిద్దామని స్పష్టం చేసింది. తుంగభద్ర బోర్డు సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్‌ డి.రంగారెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. 
 

పూడికతో నీటి లభ్యత తగ్గింది: కర్ణాటక 
తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్‌)లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి లభ్యత తగ్గిందని బోర్డు సమావేశంలో కర్ణాటక జలవనరుల కార్యదర్శి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. నవలి వద్ద రిజర్వాయర్‌తోపాటు శివపుర చెరువు సామర్థ్యాన్ని 4.25 టీఎంసీలకు, విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. దీనివల్ల తుంగభద్ర జలాశయంపై ఒత్తిడి తగ్గి 3 రాష్ట్రాలు కేటాయింపుల మేరకు నీటిని వాడుకోవచ్చని ప్రతిపాదించారు. 

అధికంగానే తరలిస్తోంది: ఏపీ ఈఎన్‌సీ 
కర్ణాటక ప్రతిపాదనను ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తోసిపుచ్చారు. నవలి రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. 2008లో టోపోగ్రాఫిక్‌ సర్వేలో టీబీ డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలుగా తేల్చారని, 2016 సర్వేలో మాత్రం 104.869 టీఎంసీలుగా లెక్క కట్టారని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే టీబీ డ్యామ్‌ నుంచి కర్ణాటక సర్కార్‌ భారీ ఎత్తున నీటిని తరలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. నీటి లెక్కలను తేల్చాకే నవలి రిజర్వాయర్‌ అంశాన్ని చర్చించాలని స్పష్టం చేశారు. తుంగభద్ర వరద జలాలను ఒడిసి పట్టేందుకు హెచ్చెల్సీకి సమాంతరంగా రోజుకు ఒక టీఎంసీ తరలించే సామర్థ్యంతో వరద కాలువ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

డీపీఆర్‌లు అందచేస్తే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్‌ రంగారెడ్డి తెలిపారు. బోర్డు పరిధిలో చేపట్టే పనులకు రివర్స్‌ టెండరింగ్‌ వర్తింపచేస్తామన్నారు. కాగా, ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు సహకరించాలన్న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ప్రతిపాదనపై ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్‌ నిధులు డిపాజిట్‌ చేస్తే తమ భూభాగంలో ఉన్న ఆర్డీఎస్‌ను ఆధునికీకరించే పనులు చేపడతామన్నారు. ఆర్డీఎస్‌ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తేవాలన్న వాదనను తిప్పికొట్టారు. పుష్కరాలు నిర్వహిస్తున్నందున తుంగభద్ర డ్యామ్‌ నుంచి 15 రోజుల్లో 8 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు.

చదవండి: ఏపీ: స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు

మరిన్ని వార్తలు