రైతు ముంగిట పశు వైద్యసేవలు

29 Nov, 2023 05:17 IST|Sakshi

పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీలో వైద్యసేవలు

ఈనాడు కథనాన్ని ఖండించిన పశు సంవర్ధక శాఖ

వాస్తవాలు తెలుసుకుని రాస్తే మేలని హితవు

సాక్షి, అమరావతి: గత సర్కారు పాడి పరిశ్రమను గాలికొదిలేసింది. పశు సంవర్ధక శాఖను నిర్వీర్యం చేసి.. పశువులకు కనీస వైద్యం కూడా అందించలేని స్థితికి నెట్టేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక.. పంటలు పండించే రైతులతోపాటు పాడి రైతులకు పెద్దపీట వేస్తోంది. పశు పాలకులకు చేయూత అందిస్తుండటంతోపాటు పశువులకు 24 గంటలూ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 340 సంచార పశువైద్య ఆరోగ్య సేవారథాలను రంగంలోకి దించింది.

7,396 ఆర్బీకే క్లస్టర్లలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన పశు వైద్య నిపుణులను నియమించి పశువులకు అన్నిరకాల వైద్య సేవలు అందిస్తోంది. అయినా.. ‘ఈనాడు’కు ఇవేమీ కనిపించడం లేదు. తన సహజ నైజంలో పశువుల పైనా విషం చిమ్మింది. ‘పశువులూ అల్లాడుతున్నాయ్‌’ శీర్షి­కన రామోజీ మార్కు జర్నలిజంతో మంగళవారం నాటి సంచికలో అబద్ధపు కథనాన్ని వండి వార్చింది.

ఆ కథనం పూర్తిగా సత్యదూరం
‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్‌ ఖండించారు. కథనంలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తి సత్యదూరంగా ఉన్నాయన్నారు. మూగజీవాలకు మెరు­గైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. వైద్య సేవలు అందక పశువులు చనిపో­తున్న ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా చోటుచేసు­కోవడం లేదన్నారు. రాష్ట్రంలో 1,577 పశు వైద్యశాలలు, 323 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 12 వెటర్నరీ పాలీ క్లినిక్స్‌ ద్వారా పశు పోషకులకు అత్యంత చేరువలో నాణ్యమైన, మెరుగైన అత్యా­ధునిక పశు వైద్యాన్ని అందిస్తున్నామని వివరించారు.

క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం ఉచితంగా చేస్తూ పశువులను ప్రాణాపాయం నుంచి కాపా­డుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో 2 సూపర్‌ స్పెషా­లిటీ పశు వైద్యశాలల ద్వారా మనుషుల తరహాలో పశువులకూ 24 గంటల వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 1.66 కోట్ల పశుగణ యూనిట్లు ఉండగా.. 1,527 పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. నియోజకవర్గ స్థాయిలో రూ.240.69 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 340 సంచార పశు వైద్య ఆరోగ్య సేవారథాల్లో మరో 701 మంది పశు వైద్యులు సేవలందిస్తున్నా­రని చెప్పారు.

గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా.. వాటిలో 7,396 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన పశు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా ప్రాథమిక పశువైద్య సేవలతోపాటు కృత్రిమ గర్భధారణ సేవలు, పశు యాజమాన్యం, పశుగ్రాసాల పంపిణీ, పశు పోషణకు కావలసిన సేవలన్నీ అందిస్తున్నామని వివరించారు. ఆర్బీకేల్లో రెండు విడతల్లో నియమించిన 4,652 మంది గ్రాడ్యుయేట్స్‌ సేవలందిస్తుండగా.. తాజాగా మరో 1,896 ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు.

దేశంలో మరెక్కడా లేనివిధంగా..
దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో రూ.24.14 కోట్లతో 154 పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌ను ప్రభుత్వం అందుబా­టులోకి తీసుకొచ్చిందని అమరేంద్రకుమార్‌ పేర్కొ­న్నారు. ప్రతి ల్యాబ్‌లో ఒక ల్యాబ్‌ టెక్నీషి­యన్, అటెండర్‌ని నియమించారని చెప్పారు. ల్యాబ్‌ల ద్వారా పేడ పరీక్షలు, రక్త పరీ­క్షలు, పాల పరీక్షలు, మూత్ర పరీక్షలు, చర్మ సంబంధ వ్యాధి పరీక్షలు, యాంటీ బయో­టిక్‌ సెన్సి­టివిటీ, జీవక్రియ వ్యాధి పరీక్షలు నిర్వహి­స్తు­న్నారన్నారని చెప్పారు.

వీటి ఫలితాల ఆధారంగా సత్వర, కచ్చితమైన పశు వ్యాధు­లను నిర్ధా­రించి, నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తు­న్నా­మన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 51,772, గుజరాత్‌లో 36,540, బిహార్‌లో 32,138, తెలంగాణలో 32,127, ఉత్తరప్రదేశ్‌లో 27,480, రాజ­స్థాన్‌లో 20,821 జీవాలకు ఒక పశు­వైద్యుడు చొప్పున సేవలు అందిస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం ప్రతి 17,808 జీవాలకు ఒక పశు వైద్యుడు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు.  పశు వైద్యానికి అత్యధిక ప్రాధా­న్యత ఇస్తున్నా­మనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు