సులభంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా..

29 Nov, 2023 05:38 IST|Sakshi

పథకం పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు వైద్య శాఖ కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్భాందవి ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దురదృష్టవశాత్తు అనారో­గ్యం బారినపడినా, ప్రమాదానికి గురైనా సదరు వ్యక్తులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఈ పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్‌ను పథకం పరిధిలోకి తెచ్చారు.

1,059 నుంచి 3,257కు ప్రొసీజర్స్‌ను పెంచి ప్రజలకు ఆరోగ్య భరోసానిస్తున్నారు. ఇలాంటి పథకం గురించి తెలియక, సేవలు ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేక పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం చేతి నుంచి డబ్బు పెట్టకూడదని ప్రభుత్వం భావించింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పథకం పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసం డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆరోగ్యశ్రీపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమానికి వైద్య శాఖ శ్రీకారం చుట్టింది.   
ప్రతి ఇంటికీ వైద్య సిబ్బంది 
ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీపై  విస్తృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీస­ర్, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఆరో­గ్యశ్రీ సేవలపై సవివరంగా రూపొందించిన బ్రోచర్‌ను ప్రతి ఇంటిలో అందజేస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్య, ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా, సులువుగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరిస్తారు.

తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, ఆయా ఆస్పత్రుల్లో అందే వైద్య సేవల గురించి చెబుతారు. సేవలు వినియోగించుకోవడంలో ఏమైనా సమస్యలు తలెత్తినా, సంతృప్తకర స్థాయిలో సేవలు అందకపోయినా 104కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవడంతో పాటు, ఎలా ఫిర్యాదులు చేయాలో వివరిస్తారు. ఎక్కడైనా లంచాలు డిమాండ్‌ చేస్తే 14400కు ఫోన్‌ చేసి కూడా ఫిర్యాదు చేసేలా చైతన్యం కల్పిస్తారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి భృతి అందిస్తున్న ఆరోగ్య ఆసరా గురించి తెలియపరుస్తారు.  

అర చేతిలో ఆరోగ్యశ్రీ 
ప్రజలకు మరింత సులువుగా పథకం సేవలు అందించడానికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రభు­త్వం రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా ఒన­గూరే ప్రయోజనాలను వైద్య సిబ్బంది ప్రజల ఇంటి వద్దే తెలియజేసి వారి స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి, ఎలా వినియోగించాలో వివరిస్తారు. యాప్‌ ద్వారా గతంలో చేయించుకున్న చికిత్సల మెడికల్‌ రిపోర్ట్‌లను భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఎలా పొందవచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడాన్ని తెలియపరుస్తారు.

క్కో కుటుంబానికి కనీసం 15 నిమిషాలు  
ఆరోగ్యశ్రీ పథకం సేవల గురించి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపై అవగాహన లేని కుటుంబం రాష్ట్రంలో ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పించేలా విస్తృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ఏఎన్‌ఎం, సీహెచ్‌వో ప్రతి కుటుం­బానికి కనీసం 15 నిమిషాలు కేటాయించి పథకం సేవలపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను ప్రతి ఇంటికి అందజేస్తారు.    – డాక్టర్‌ వెంకటేశ్వర్,  డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో

మరిన్ని వార్తలు