దారి తప్పుతున్న యువత.. ప్రమాదంలో భవిత

9 Jul, 2022 16:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘రాయచోటికి చెందిన ఐదుగురు యువకులు  పగలు కూలి పనులు చేస్తూ రాత్రులలో చోరీలు చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసలు కావడంతో వచ్చే కూలీ డబ్బులు సరిపోక కనిపించిన వస్తువు ఎంత విలువైనది అనేది కాకుండా అన్నింటినీ చోరీ చేసేవారు. ఆటోలకు ఉన్న బ్యాటరీలు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు వంటివి దోచుకెళ్లి జల్సాలు చేసుకునేవారు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు’.   

‘మదనపల్లె టూటౌన్‌ పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీ చేసే ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం  చేసుకున్నారు. నిందితులు అందరూ పాతికేళ్ల వయస్సు కుర్రాళ్లే. వీరు టెన్త్, ఇంటర్‌ చదివి విలాసాలకు అలవాటు పడి నేరస్తులుగా మారారు’. 

‘మదనపల్లె మండలానికి చెందిన వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతూ ఖర్చులకు డబ్బులు లేక రాత్రి పూట రహదారుల్లో తిరుగుతూ దోపిడీలకు పాల్పడేవారు. మారణాయుధాలతో 
వాహనదారులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను దోపిడీ చేసేవారు. ఎట్టకేలకు పోలీసులు ఏడుగురు  నిందితులను అరెస్టు చేశారు’. 
 
‘అతడు విద్యావంతుడు. విలాసాలకు అలవాటు పడి మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలు చోరీ చేసేవాడు.  ఇతని వయస్సు కేవలం 25 ఏళ్లే. బైకు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు’.   

‘చెడు అలవాట్లకు బానిసలై.. గంజాయి సేకరించి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను మదనపల్లె పట్టణ పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. 

‘మదనపల్లెకు చెందిన నలుగురు యువకులు కలిసి కార్లను బాడుగకు తీసుకువచ్చి కుదవకుపెట్టి, మళ్లీ అదే కార్లను చోరీ చేసేవారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు’.  

సాక్షి, మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడటం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివి ఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం సెల్‌ఫోన్‌ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. తల్లిదండ్రులు  పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అనర్థాలపై యువకులకు అవగాహన 
నేరాల వల్ల జరిగే అనర్థాల గురించి యువకులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాం. యువత మంచి మార్గంలో నడవాలి. బిడ్డలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. వారిని వదిలేస్తే చెడుదారుల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడతారు.  
– రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె. 

నైతిక విలువలు ప్రధానం
పిల్లలకు మార్కులు కాదు. బిహేవియర్‌ క్వాలిటీస్‌ ప్రధానం.  నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులకు సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. 
– జల్లా లలితమ్మ, బాలల హక్కుల ఐక్య వేదిక అధ్యక్షురాలు 

విలువలు నేర్పించాలి 
పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలి. దీని బాధ్యత  తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తీసుకోవాలి. పిల్లలు అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. వారికి నీతి కథలు, మంచి, చెడు గురించి సూక్తులు బోధించాలి.  
– ఎస్‌.మహమ్మద్‌ అయూబ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రాయచోటి. 

సమాజం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది 
యువత వ్యసనాలకు లోనై నేరమార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తు మందులు, సిగరెట్లను స్టేటస్‌ సింబల్‌గా, హీరోయిజంగా భావిస్తున్నారు. చదువులకు క్రమంగా దూరమై కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు.  విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి.     
– డాక్టర్‌ రాధిక, మానసిక వైద్యనిపుణురాలు, మదనపల్లె

మరిన్ని వార్తలు