కన్నుల పండువగా సత్యదేవుని తెప్పోత్సవం

25 Nov, 2023 02:55 IST|Sakshi

అన్నవరం/అరసవల్లి: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపా నదిలో కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంసవాహనంపై సత్యదేవుడు, అమ్మవార్లు నదిలో విహరించారు. ఈ తెప్సోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.

సాయంత్రం 5–30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరాన గత పూజా మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6–30  గంటలకు స్వామి అమ్మవార్లను హంస వాహనంపై కూర్చోబెట్టి  తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్, ఈఓ కే రామచంద్ర మోహన్,  ఏసీ రమే‹Ùబాబు పాల్గొన్నారు. సుమారు 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

వైభవంగా ఆదిత్యుని తెప్పోత్సవం 
ప్రఖ్యాత అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉషాపద్మినిఛాయా దేవేరులతో స్వామి వారు హంస వాహనంపై పవిత్ర ఇంద్రపుష్కరిణిలో 12 సార్లు జలవిహారం చేశారు. అలాగే రోజంతా ఆదిత్యుడు పూర్తి స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ సమక్షంలో హంస నావలో శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు