సత్యదేవుని ఆభరణాల డిజిటలైజేషన్‌

23 May, 2022 13:58 IST|Sakshi
ఆభరణాల డిజిటలైజేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఈఓ త్రినాథరావు, ఏసీ రమేష్‌బాబు

అన్నవరం: సత్యదేవుని బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. ఉత్సవాలు, ఇతర పర్వదినాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలను డిజిటలైజ్‌ చేసేందుకు దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు ఆధ్వర్యాన ఫొటోలు తీయించారు. స్వామి వారికి ప్రతి రోజూ అలంకరించే ఆభరణాలను తీయడం సాధ్యం కాదు కనుక వాటిని స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు మూలవిరాట్‌కు అభిషేకం చేసేందుకు తీసినపుడు డిజిటలైజ్‌ చేయాలని నిర్ణయించారు. 

సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి కిరీటాలు, హారాలు, నేత్రాలు, స్వామివారి మీసం, కర్ణాభరణాలు, బంగారు పాత్రలు, పళ్లాలు సుమారు వంద ఆభరణాలను ఆదివారం రికార్డు ప్రకారం తూకం వేసి, ఫొటోలు తీయించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట శ్రీనివాస్, అర్చకుడు సుధీర్, అకౌంట్స్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, బలువు సత్య శ్రీనివాస్, ఎస్‌పీఎఫ్‌ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రతి ఆభరణాన్నీ ఫొటో తీసి, రికార్డుల ప్రకారం సరి చూసి, దాని పేరు, బరువు, ఇన్వెంటరీ నంబర్, తనిఖీ చేసిన తేదీ తదితర వివరాలతో ఆల్బమ్‌ చేయించి, దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి నిత్యం అలంకరించే ఆభరణాలు సుమారు 200 ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో వాడి పాతబడటంతో ప్రస్తుతం దేవస్థానం లాకర్లలో ఉంచిన ఆభరణాలు మరో 200 ఉన్నాయి. వీటి రక్షణకు దేవస్థానంలో నిత్యం 12 మంది ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రధానాలయం వద్ద కాపలా ఉంటారు. 

దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవస్థానంలో గతంలో గోల్డ్‌ బాండ్‌ కోసం ఎస్‌బీఐకి ఇవ్వగా మిగిలిన ఆభరణాలన్నింటినీ డిజిటలైజ్‌ చేస్తున్నామని ఈఓ త్రినాథరావు చెప్పారు. రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ ఆలయాల్లోని ఆభరణాలను సోమవారం, బ్యాంకుల్లోని ఆభరణాలను మంగళవారం డిజిటిలైజ్‌ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాడకంలో లేని ఆభరణాలను దేవస్థానానికి తిరిగి జమ చేయాల్సిందిగా అర్చకులను ఆదేశించామన్నారు. డిజిటలైజేషన్‌ వలన భవష్యత్తులో ఆ ఆభరణం చోరీ అయినా లేక పాడయినా దాని వివరాలు తెలుస్తాయని ఈఓ తెలిపారు. (క్లిక్‌: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!)

మరిన్ని వార్తలు