AP Assembly Session 2021: గిరిజనుల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ

24 Nov, 2021 09:15 IST|Sakshi

Time: 02:45 PM

► జగనన్న గోరుముద్దతో మంచి పౌష్టికాహారాన్ని అందించామని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. నాడు- నేడు కార్యక్రమం ఏపీ చరిత్రలో గొప్ప పథకమని అన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేశామని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. 

Time: 02:40 PM

► జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనతో గిరిజనులకు ఎంతోమేలు జరిగిందని మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. ఈ పథకాల కింద రూ.74.4 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. గిరిజన బిడ్డలకు అమ్మఒడి పథకం ఎంతో లబ్ధి చేకూర్చిందన్నారు. 2.86 లక్షల ఎస్టీ విద్యార్థులకు రూ. 843.80 కోట్లు వెచ్చించారని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ఇ‍చ్చిన ప్రతి హామీని.. సీఎం జగన్‌  పకడ్బందీగా అమలు చేస్తున్నారని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. 

Time: 02:25 PM

► గిరిజనుల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు. పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ గిరిజనుల కష్టాలు చూశారన్నారు. అధికారంలోకి రాగానే వారికి అండగా నిలిచారని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 

Time: 01:51 PM

► సినిమాటోగ్రఫి చట్టసవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈసందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ..  సినిమా షోలను కొందరు ఇష్టానుసారంగా వేస్తున్నారని  అన్నారు. పేద,మధ్యతరగతి వాళ్ల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ ఇచ్చే పద్ధతి తేవాలనుకున్నామని మంత్రి  తెలిపారు.

Time: 01:21 PM

► విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి విశ్వరూప్‌ అన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లలా మార్చామని తెలిపారు. విదేశీ విద్యా ఫండ్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచామన్నారు. 45 నుంచి 60 ఏళ్ల వయస్సున్న 5 లక్షల 83వేల ఎస్సీ మహిళలకు రుణాలిచ్చామని మంత్రి విశ్వరూప్‌ పేర్కొన్నారు.

Time: 12:19 PM

► చంద్రబాబు సామాజిక వర్గం అభివృద్ధి కోసమే అమరావతి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెలే టీజేఆర్‌  సుధాకర్‌బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.

Time: 10:56 AM

పేద, బడుగు వర్గాలకు నవరత్నాలతో భరోసా కల్పిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి సంక్షేమ పథకాలకు మోకాలడ్డుతున్నారన్నారు.

Time: 10:39 AM

ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి అన్నారు. ప్రాధాన్యత ఉన్న పదవుల్లో ఎస్సీలకు అవకాశం ఇచ్చారన్నారు. ఎస్సీ ఉపకులాలకు సైతం సముచిత ప్రాధాన్యత దక్కిందని తిప్పేస్వామి అన్నారు. ఎస్సీ ఉపకులాల గణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కోరారు. నామినేటెడ్‌ పోస్టులో కూడా సీఎం జగన్‌ రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. ఎస్సీలను చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ హయాంలోఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దుర్వినియోగం చేశారని తిప్పే స్వామి అన్నారు.

Time: 10:34 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. బడుగుల అభ్యున్నతికి నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అవసరమన్నారు. బడ్జెట్‌లో 45 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు.

Time: 10:26 AM

వైఎస్సార్‌ దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. 2014 నుంచి 2019 వరకు దళితుల స్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దళితులను అణగదొక్కే విధంగా టీడీపీ పాలన సాగిందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు.

Time: 9:37 AM

రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Time: 9:24 AM

అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చను స్పీకర్‌ చేపట్టారు.

Time: 9:15 AM

సాక్షి, అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

మరిన్ని వార్తలు