‘స్థానిక’ ఉప ఎన్నికలకు కసరత్తు 

20 Dec, 2022 04:04 IST|Sakshi

పీఆర్, మున్సిపల్‌ అధికారులతో ఎస్‌ఈసీ కార్యదర్శి సమావేశం 

945 స్థానాలకు ఉప ఎన్నికలు అవసరమని గుర్తింపు 

జనవరిలో కొత్త ఓటర్ల జాబితా వెల్లడించనున్న ఈసీ 

ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం 

సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల వివరాల సేకరణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కేఈఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి సోమవారం పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు.

గ్రామీణ స్థానిక సంస్థల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోయినవి కాకుండా 2021లో ఎన్నికలు జరిగి, గెలిచిన అభ్యర్థుల మరణం, రాజీనామాల కారణంగా ప్రస్తుతం ఐదు జెడ్పీటీసీ, 102 ఎంపీటీసీ, 53 సర్పంచి, 770 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 11 డివిజన్‌ కార్పొరేటర్, నాలుగు వార్డు కౌన్సిలర్‌ పదవులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించారు.

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 945 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమని గుర్తించారు. మరోవైపు ఒక మున్సిపల్‌ చైర్మన్, ఏడు ఎంపీపీ, తొమ్మిది వైస్‌ ఎంపీపీ, ఐదు కో–ఆప్షన్‌ సభ్యుల పదవులకు కూడా పరోక్ష పద్ధతిలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తేల్చారు.   

కొత్త ఓటర్ల జాబితాలతోనే...  
కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరిలో కొత్త ఓటర్ల జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ జాబితాల ప్రకారమే స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.     

మరిన్ని వార్తలు