AP: రాజ్‌భవన్‌లో ఘనంగా గాంధీజీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు

2 Oct, 2021 14:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీజీ అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. మహత్మా గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌భవన్‌ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని అన్నారు. కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారని తెలిపారు. గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవటం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు.

మహాత్మా గాంధీ సత్యం, న్యాయం పట్ల విశ్వాసంతో యావత్త్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ చేసిన కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప నాయకుడిని స్మరించుకోవటానికి, ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణంలో పునరంకితం కావటానికి జయంతి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సామాన్యులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ప్రజా జీవితం దేశ ప్రజలలో చిరస్ధాయిగా నిలిచిపోయిందన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్ అన్నారు. గాంధీజీ జయంతి వేడుకలలోభాగంగా గవర్నర్.. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారంచుట్టారు. రాజ్భవన్ ఆవరణలో తొలిమొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌పీ సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఛైర్మన్‌ డాక్టర్ శ్రీధర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీడా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు