యూనిట్‌కు రూ.1.45 సబ్సిడీ

18 Nov, 2020 19:14 IST|Sakshi

విద్యుదుత్పత్తి ఖర్చు రూ.7.74.. రాబడి రూ.6.29

మునుపెన్నడూ లేనివిధంగా వినియోగదారులకు సబ్సిడీ

గృహ వినియోగానికి రూ.1,707 కోట్లు

ప్రజలపై భారం పడకుండా సంస్థలకు జవసత్వాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తై ప్రజల వద్దకు చేరవేసేందుకు యూనిట్‌కు రూ.7.74 చొప్పున ఖర్చవుతుండగా వినియోగదారుల నుంచి వచ్చే రాబడి సగటున యూనిట్‌కు రూ.6.29 మాత్రమే ఉంది. అంటే ప్రతి యూనిట్‌కూ రూ.1.45 చొప్పున నష్టం వాటిల్లుతుండగా ప్రభుత్వమే దీన్ని భరిస్తోంది. ప్రజలపై భారం మోపకుండా విద్యుత్‌ను సబ్సిడీ రేట్లకు అందిస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు పరిమితంగా ఉచిత విద్యుత్తూ అందుతోంది. 

ఎన్నడూ లేనంత సబ్సిడీ
ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ రంగానికి ఈ ఏడాది ప్రభుత్వం రూ.10,060.63 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఇందులో రూ.1,707.07 కోట్లు గృహ విద్యుత్‌ వినియోగదారులకే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. ఫలితంగా 2020–21లో యూనిట్‌కు రూ.1.45 చొప్పున ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. 

నియంత్రణలోనూ...
ప్రజలకు చౌకగా విద్యుత్‌ ఇవ్వాలంటే ముందుగా సంస్థలు అనవసర వ్యయాన్ని తగ్గించాలి. ఈ సూత్రాన్ని పాటించడం వల్ల ఏపీ విద్యుత్‌ సంస్థలు మెరుగైన ఫలితాలు చూపగలిగాయి. గత సర్కారు హయాంలో 2019లో విద్యుత్‌ సంస్థల నిర్వహణ వ్యయం రూ.48,110.79 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం రూ.43,327.56 కోట్లకు తగ్గించగలిగారు.
అంటే దాదాపు రూ.4,783.23 కోట్ల మేర అనవసర వృథాను అరికట్టారు. 2019లో యూనిట్‌ విద్యుదుత్పత్తి ఖర్చు రూ. 8.82 చొప్పున ఉండగా దుబారాను నివారించడం వల్ల ఈ ఏడాది రూ.7.74కి తగ్గింది. 

శాపాలైన గత పాపాలు....
2015లో విద్యుత్‌ సంస్థల నిర్వహణ వ్యయం రూ.24,969.09 కోట్లు కాగా 2019 మార్చి నాటికి ఇది రూ.48,110.79 కోట్లకు చేరింది. ఐదేళ్ల వ్యవధిలో వ్యయం రెట్టింపైంది. మార్కెట్లో చౌకగా విద్యుత్‌ లభిస్తున్నా అత్యధిక రేట్లతో ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్లకే గత ప్రభుత్వం ఆసక్తి చూపడం ఇందుకు ప్రధాన కారణం.

భారీగా సబ్సిడీ..
నిర్వహణ వ్యయం పెరిగిన కొద్దీ విద్యుత్‌ టారిఫ్‌ పెరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని నియంత్రణ మండలి ముందు స్పష్టం చేయకుండా ఐదేళ్ల తర్వాత 2019 జనవరిలో ట్రూ–ఆప్‌ పేరుతో రూ.19,604 కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు కమిషన్‌ అనుమతి కోరింది. ఈ భారమంతా ప్రజలపై పడకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు భారీగా సబ్సిడీ ఇచ్చింది. 2015లో యూనిట్‌కు కేవలం 59 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా 2020లో యూనిట్‌కు రూ.1.45 చొప్పున సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతోంది.

మరిన్ని వార్తలు