వాటా నీటినే వాడుకుంటాం

6 Aug, 2020 02:49 IST|Sakshi

కేటాయింపుల కంటే ఒక్క చుక్కా అదనంగా వినియోగించుకోం 

కృష్ణా బోర్డు కేటాయింపులున్నా శ్రీశైలం నుంచి నీళ్లందని దుస్థితి  

దుర్భిక్ష సీమ దాహార్తి తీర్చేందుకే రాయలసీమ ఎత్తిపోతల 

సుప్రీంలో నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం 

తెలంగాణ అభ్యంతరాలను సమర్థంగా తిప్పికొట్టాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని సుప్రీంకోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కిన తెలంగాణ ప్రభుత్వం.. అపెక్స్‌ కౌన్సిల్, కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డుల నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలో 777 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలను తరలించేందుకు డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంచిందని, ఎడమ గట్టు కేంద్రం ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు నాలుగు టీఎంసీలను దిగువకు విడుదల చేస్తోందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. 2016 సెప్టెంబరు 21న జరిగిన తొలి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో తమ వాటా నీటిని వాడుకోవడానికే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టామన్న తెలంగాణ సర్కార్‌ వాదనను గుర్తు చేస్తూ తాము కూడా ఇప్పుడు వాటా జలాలను వినియోగించుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని తేల్చిచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘రాయలసీమ ఎత్తిపోతల’ టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ తెలంగాణ సర్కారు మంగళవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. తెలంగాణ వాదనలను సమర్థంగా తిప్పికొట్టి పనులకు అడ్డంకులు తొలగిపోయేలా ప్రభుత్వం సన్నద్ధమైంది.

కేటాయింపులున్నా కన్నీళ్లే..!
శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు 114 టీఎంసీలు సరఫరా చేయాలి. జలాశయంలో 881 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు రాయలసీమ ప్రాజెక్టులకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. నీటిమట్టం 854 అడుగుల్లో ఉంటే కేవలం ఏడువేల క్యూసెక్కులే సరఫరా చేసే వీలుంది. 854 నుంచి 841 అడుగులదాకా కేవలం వెయ్యి నుంచి రెండువేల క్యూసెక్కులనూ తరలించలేని దుస్థితి. అంతకంటే నీటిమట్టం తగ్గితే రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లందవు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో 797 అడుగుల(243 మీటర్లు) నుంచి రోజుకు మూడు టీఎంసీల(34,722 క్యూసెక్కులు) వంతున ఎత్తిపోసి పీహెచ్‌పీకి దిగువన కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు తరలించి సాగు, తాగునీటి కష్టాలను తీర్చే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్రసర్కారు చేపట్టింది.

పోతిరెడ్డిపాడు ఆయకట్టు విభజన చట్టంలోదే..
పోతిరెడ్డిపాడు కింద రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 18.92 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది విభజన చట్టంలో పేర్కొన్న ఆయకట్టు. ఈ ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని వివరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

రాయలసీమ ఎత్తిపోతల తప్పెలా అవుతుంది?
తమ వాటా నీటిని వాడుకోవడానికే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టామని తెలంగాణ సర్కార్‌ గతంలో అపెక్స్‌ కౌన్సిల్‌కు తెలిపింది. అలాంటప్పుడు మన వాటా నీటిని వినియోగించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడం తప్పెలా అవుతుంది?
– ఆదిత్యనాథ్‌దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరులశాఖ

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకే..
శ్రీశైలంలో నీటిమట్టం 841 అడుగుల్లో ఉన్నప్పుడు జూలై 19న తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. దీనిపై కృష్ణా బోర్డుకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం. విద్యుదుత్పత్తి ఆపాలని తెలంగాణ సర్కార్‌ను కృష్ణా బోర్డు ఆదేశించినా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ఏటా ఇదే కథ. ఏపీ ప్రయోజనాల్ని పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది.
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరులశాఖ

మరిన్ని వార్తలు