AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం

26 Oct, 2022 09:41 IST|Sakshi

ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని విశాఖ వాసికి ఆదేశం

క్రిమినల్‌ కోర్టు ధిక్కార కేసు నమోదుకు ఆదేశం

ఇది కోర్టు ప్రక్రియ దుర్వినియోగమేనన్న న్యాయమూర్తి 

సాక్షి, అమరావతి: మొదట ఓ పిటిషన్‌ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్‌ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. ఖర్చుల కింద నెల రోజుల్లో రూ.లక్ష హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. గడువు లోపు చెల్లించకపోతే ఆ మొత్తం వసూలుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ జనరల్‌కు తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు అతనిపై క్రిమినల్‌ కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఉపక్రమించింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని సంబంధిత బెంచ్‌ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ఇటీవల తీర్పు వెలువరించారు.
చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు 

విశాఖపట్నం సాగర్‌నగర్‌ ఎంఐజీ ఇళ్ల సమీపంలో కామన్‌ ఏరియా స్థలాన్ని ఈశ్వరరావు, మరొకరు ఆక్రమించారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ అదే ప్రాంతానికి చెందిన రంగారావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే, ఇదే అంశంపై అక్టోబర్‌లో మరో పిటిషన్‌ వేశారు. మొదటి దాని గురించి రెండో పిటిషన్‌లో పేర్కొనలేదు. అలాగే ఈ విషయానికి సంబంధించి ఇంతకు ముందు తానెలాంటి పిటిషన్‌ వేయలేదని అందులో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి విచారణ జరిపారు

రెండో పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు రంగారావు వేసిన మొదటి పిటిషన్‌ గురించి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ న్యాయవాది వి.సూర్యకిరణ్, గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ న్యాయవాది ఎస్‌.లక్ష్మీనారాయణరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. మొదటి పిటిషన్‌ దాఖలుకు స్థానిక న్యాయవాదికి అన్ని కాగితాలు ఇచ్చారని, అయితే, ఆ పిటిషన్‌ వేసిన సంగతి మాత్రం రంగారావుకు తెలియదని ఆయన తరఫు న్యాయవాది వివరించారు.

రెండో పిటిషన్‌ దాఖలుకు ఆయన తన వద్దకు వచ్చారని, గత పిటిషన్‌ సంగతి చెప్పలేదని అన్నారు. దీంతో న్యాయమూర్తి మొదట పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదిని పిలిపించారు. రంగారావే ఆ పిటిషన్‌ దాఖలు చేశారని ఆ న్యాయవాది తెలిపారు. దీంతో మొదటి పిటిషన్‌ దాఖలు చేసింది రంగారావే అని నిర్ధారణకు న్యాయమూర్తి వచ్చారు. రంగారావు దాఖలు చేసిన రెండో పిటిషన్‌ను కొట్టేస్తూ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆయన్ను ఆదేశించారు. ఆయనపై క్రిమినల్‌ కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు