AP: జీవో- 44 అమలుపై స్టే ఎత్తివేత

17 Aug, 2021 08:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) నిబంధనల అమలులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యాహక్కు చట్టం అమలును సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని అసలైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 1కి వాయిదా వేసింది.

ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యా యమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్‌ యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధనల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 44 అమలుపై హైకోర్టు గతంలో స్టే విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

దీనివల్ల ప్రతి విద్యా సంవత్సరంలో లక్షల మంది పిల్లలు ఉచిత సీట్లను కోల్పోతున్నారని వివరించారు. ఇది విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చడమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధన అమలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
 

మరిన్ని వార్తలు