డేటాదొంగ బాబు.. డేరాబాబా కన్నా డేంజర్‌: మంత్రి రోజా

20 Sep, 2022 13:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: డేటా చోరీపై హౌజింగ్‌ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల డేటాను ప్రజాసాధికారత సర్వే పేరుతో.. సేవా మిత్ర యాప్‌ ద్వారా తెలుగు దేశం నాయకులకు అందించిందని, తద్వారా దుష్టరాజకీయానికి తెర తీసిందని ఆమె మండిపడ్డారు. 

సభాసంఘం కమిటీ ఇవాళ అసెంబ్లీకి సమర్పించిన మధ్యంతర నివేదికలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ నిర్ధారణ కావడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడారు. ‘హౌజ్‌ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే గనుక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా జోస్యం పలికారు. ఈ డేటా దొంగ.. డేరాబాబా కన్నా డేంజర్‌ అనే విషయం అందరికీ స్పష్టం అవుతోందని ఆమె అన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారనే విషయాన్ని  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సైతం ధృవీకరించిన విషయాన్ని మంత్రి రోజా గుర్తు చేశారు. ఓటర్లను తొలగించడమే కాకుండా.. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రతిపక్ష సభ్యులను బ్లాక్‌మెయిల్‌ చేసి రాజకీయంగా లొంగదీసుకునే ప్రయత్నం కూడా జరిగిందని మంత్రి రోజా ఆరోపించారు. నారా లోకేష్‌ను చూస్తే జాలేస్తోందని, ఎన్టీఆర్‌గారి మీద లేనిపోని అభిమానం కురిపిస్తూ అన్నాక్యాంటీన్‌ల మీద రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వం పథకాల పేరుతో దోచుకుందని.. ఇప్పుడు సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాసంక్షేమం గురించి ఆలోచిస్తుందని, లేనిపోని విమర్శలు మాని ఆ పథకాలను అర్థం చేసుకునే  ప్రయత్నం చేయమని ఆమె టీడీపీకి హితవు పలికారు.

ఇదీ చదవండి: ఇది టీడీపీ భారీ కుట్రే: ఏపీ అసెంబ్లీ హౌజ్‌ కమిటీ

మరిన్ని వార్తలు