విశాఖలో వింత జాతర.. మురుగు నీరు మీద జల్లుకుంటూ

29 Nov, 2021 15:05 IST|Sakshi

విశాఖ జిల్లా దిమిలిలో నేడు బురదమాంబ సంబరం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎక్కడాలేని రీతిలో విచిత్రంగా ఉంటుంది విశాఖ జిల్లాలోని దిమిలి బురదమాంబ జాతర. యలమంచిలి నియోజకవర్గం.. రాంబిల్లి మండల పరిధిలోని కొలువుదీరిన ఈ దిమిలి గ్రామ దేవత దల్లమాంబ అనుపు మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో బురదమాంబ అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. మంగళవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉ.10 గంటల వరకు బురదమాంబ జాతర జరుగుతుంది.

ఇక సోమవారం అర్ధరాత్రి నుంచే జాతర కోలాహలం కనిపిస్తుంది. ఈ జాతరలో పురుషులంతా వేపకొమ్మలు చేతబూని మురుగుకాలువల్లోని బురదలో వేపకొమ్మలు ముంచి ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొట్టడం ఈ జాతర ప్రత్యేకత. బురద పూసుకున్నా ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉండటం అమ్మవారి మహత్యంగా గ్రామస్తుల నమ్మకం.

అనంతరం ఆ కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి బురదమాంబకు పూజలు చేస్తారు. అయితే, మహిళలకు మాత్రం బురద జల్లుకోవడం నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఇక్కడి అమ్మవారి విగ్రహం బురదలో లభించింది కాబట్టి ఆమెను బురదమాంబగా పిలుస్తారు. 

>
మరిన్ని వార్తలు