మౌలికవసతుల కల్పనలో రికార్డు వ్యయం 

3 Oct, 2022 05:39 IST|Sakshi

టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు ఖర్చుపెట్టిన ఏపీఐఐసీ 

వైఎస్సార్‌సీపీ మూడేళ్ల పాలనలో రూ.1,058 కోట్లు 

రాష్ట్ర విభజన తర్వాత 2021–22లో అత్యధికంగా రూ.348.71 కోట్లు వ్యయం 

కొత్తగా 51 పార్కుల అభివృద్ధి కూడా.. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ఇంజనీరింగ్‌ పనుల్లో రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విధంగా 2021–22లో ఈ పనుల కోసం రూ.348.71 కోట్లు వ్యయం చేసింది. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చుచేస్తే అందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు ఖర్చుచేశారు.

ప్రస్తుత వైఎస్సార్‌సీపీ సర్కారు మూడేళ్లలో రూ.1,058 కోట్లు ఖర్చుచేశారు. అంతేకాక.. ఈ సమయంలో మొత్తం 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు కల్పించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృషిచేస్తున్నామని, అందులో భాగంగా ఇంజనీరింగ్‌ పనులపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్‌వల్ల రెండేళ్లుగా అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేరుకోలేకపోయామని, ఈ ఏడాది గతేడాది కంటే అత్యధికంగా వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కృష్ణపట్నం వద్ద చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ పేరుతో 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.  

‘రెడీ టు బిల్డ్‌’పై ప్రత్యేక దృష్టి 
ఇక తక్షణంఉత్పత్తి ప్రారంభించేలా రెడీ టు బిల్డ్‌ ఫ్యాక్టరీలకు డిమాండ్‌ పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఐఐసీ వీటి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు గోవిందరెడ్డి తెలిపారు. కొప్పర్తి, తిరుపతి, పెద్దాపురం, విజయవాడ వంటి చోట్ల 20కిపైగా రెడీ టు బిల్డ్‌ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని, వీటివల్ల 4.80 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తోందన్నారు.

కేవలం మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా ఏపీఐఐసీ రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన ఏడేళ్లుగా చూస్తే ఏపీఐఐసీ సగటు వార్షిక ఆదాయం రూ.590 కోట్లుగా ఉంటే 2021–22లో రూ.656 కోట్లు ఆర్జించినట్లు తెలిపారు. 50 ఏళ్ల క్రితం రూ.20 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఏపీఐఐసీ ఇప్పుడు రూ.వేల కోట్ల ప్రాజెక్టులను చేపడుతోందని.. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని ప్రాజెక్టులను అభివృద్ధిచేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు.   

మరిన్ని వార్తలు