సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు

7 Aug, 2020 09:20 IST|Sakshi

విచారణకు స్వీకరించాలని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి/విశాఖ : అక్రమంగా శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం యూనివర్సల్‌ సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ఆస్పత్రి కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. గత వారం రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న ఈ కేసును పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణ చేయనున్నారు. అలాగే ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పి.నమ్రత వైద్య డిగ్రీని తక్షణమే సస్పండ్‌ చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఇలాంటి కేసులను ఉపేక్షించేది లేదని, దీనిపై లోతుగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డా.బి.సాంబశివారెడ్డి ‘సాక్షి’తో అన్నారు. (సృష్టి: వెలుగులోకి ముగ్గురు మహిళా వైద్యులు పాత్ర)

పోలీస్‌ కస్టడీకి డాక్టర్‌ నమ్రత
‘సృష్టి’ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ పి.నమ్రతను విచారణ నిమిత్తం మహారాణిపేట పోలీసులు గురువారం కేంద్ర కారాగారం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పటివరకు సంతానం కావాలని హాస్పిటల్‌కు వచ్చిన 63 మందితో సరగోసి పద్ధతిలో పిల్లల్ని సమకూర్చేందుకు డా.నమ్రత ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు పద్మజ హాస్పటల్‌కు చెందిన డాక్టర్‌ పద్మజతో కలసి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు.ఇప్పటికే ఈ కేసులో డాక్టర్‌ తిరుమల, రామకృష్ణ, కోడె వెంకటలక్ష్మిలను అరెస్ట్‌ చేసిన పోలీసులు గురువారం డాక్టర్‌ పద్మజతో పాటు ఏజెంటుగా వ్యవహరించిన ఎన్‌.నూకరత్నంను అదుపులోకి తీసుకున్నారు. (పేగుబంధంతో పైసలాట!)

మరిన్ని వార్తలు