కళ్లకు గంతలు కట్టుకున్నారా!?

11 Nov, 2023 05:17 IST|Sakshi

నాలుగేళ్లలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా 12.59 లక్షల మందికి శిక్షణ కనిపించలేదా?

175 నియోజకవర్గాల్లో 192 స్కిల్‌ హబ్స్‌లో శిక్షణ నిర్వహించాం.. 

25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 26 స్కిల్‌ కాలేజీలు ప్రారంభించాం.. 

తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీకి భూమి కేటాయించాం.. 

ప్రతీనెలా 52 జాబ్‌మేళాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నాం 

ఇవేవీ చూడకుండా ‘నైపుణ్యం ఏదీ.. ఎక్కడ’ అంటూ కబోది రాతలు ఎందుకు? 

లక్షా 60 వేల మందికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ శిక్షణనిచ్చి సర్టిఫికెట్లు ప్రదానం చేసిన విషయం కూడా తెలీదా? 

ఈనాడు విషప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి ఫైర్‌ 

సాక్షి, అమరావతి :  దేశంలో ఎక్కడాలేని విధంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు నైపుణ్య శిక్షణలో కొత్తగా క్యాస్కేడింగ్‌ స్కిల్‌ ఎకో సిస్టమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తే ఈనాడు రామోజీరావు కళ్లకు గంతలు కట్టుకుని నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లల్లో అకడమిక్, నాన్‌ అకడమిక్‌ విభాగాల్లో 12,59,451 మందికి శిక్షణనిస్తే రాష్ట్రంలో ‘నైపుణ్యం ఏది.. ఎక్కడా?’.. అంటూ ప్రభుత్వంపై విషం చి­మ్ము­తూ ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించ­డంపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

‘సాక్షి’తో శుక్ర­వారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తీసుకురావడమే కాక దానికి అనుగుణంగా స్కిల్‌ ఎకో సిస్టమ్‌ను అమలుచేస్తుంటే యువతను భయాందోళనకు గురిచేసే లక్ష్యంతో ఈనాడు విషాన్ని కక్కుతోందంటూ విమర్శించారు. పైగా.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ లక్షా 60వేల మందికి శిక్షణనివ్వడమే కాక వారందరికీ సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేసిన విషయం తెలీదా అని ఆయన ప్రశ్నించారు. 

192 స్కిల్‌ హబ్స్‌ ఉన్న విషయం తెలీదా? 
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం ఉండే విధంగా 192 స్కిల్‌ హబ్స్‌ను ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఏర్పాటుచేసిన సంగతి వాస్తవం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే,  ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 26 స్కిల్‌ కాలేజీలు ఏర్పాటుచేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే ఈనాడు రామోజీరావు పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను ప్రజలపైకి వదులుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

స్కిల్‌ హబ్స్, స్కిల్‌ కాలేజీలు ద్వారా 22 రంగాలకు చెందిన 100కి పైగా జాబ్‌రోల్స్‌లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయిలో మొత్తం నైపుణ్య శిక్షణ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తున్నామని ఇందుకోసం తిరుపతిలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాక పనులు కూడా కొనసాగుతున్నాయని మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. వీటికి అదనంగా పులివెందులలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, పరిశ్రమల ప్రాంగణంలో స్కిల్‌ స్పోక్‌ను ఏర్పాటుచేశామన్నారు.  

జాబ్‌మేళాలూ కనిపించడంలేదా? 
ఇవికాక.. విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెలా 52 జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్న విషయం కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పలు సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు వీలుగా 50కుపైగా బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే తమ నాయకుడు స్కిల్‌ స్కాంలో ఇరుక్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో ఈనాడు వికృత రాతలు రాస్తోందన్నారు.  

మరిన్ని వార్తలు