ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు

21 Feb, 2021 02:38 IST|Sakshi

ఏసీ బస్సుల్లో అన్ని సీట్లకూ వర్తింపు 

నాన్‌ ఏసీ బస్సుల్లో 10 శాతం సీట్లకే రాయితీ

48 గంటల ముందు రిజర్వేషన్‌ చేయించుకుంటేనే.. 

సాక్షి, అమరావతి: ప్రయివేటు ట్రావెల్స్‌ పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ‘ఎర్లీ బర్డ్‌’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. దీని ప్రకారం అన్ని ఏసీ బస్సు చార్జీల్లో 10 శాతం రాయితీ వర్తిస్తుండగా, నాన్‌ ఏసీ సర్వీసుల్లో(సూపర్‌ డీలక్స్, అల్ట్రా) పది శాతం సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే 48 గంటల ముందు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేయించుకున్న వారికే ఈ రాయితీలు వర్తిస్తాయి. నాన్‌ ఏసీ దూరప్రాంత సర్వీసులైన సూపర్‌ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకు గాను నలుగురికి, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 49 సీట్లకు గాను ఐదుగురికి మాత్రమే రాయితీకి అవకాశం ఉంటుంది.

పూర్తి స్థాయిలో రోడ్డెక్కనున్న ఏసీ సర్వీసులు 
సంస్థలో మొత్తం ఏసీ సర్వీసులు 348 వరకూ ఉండగా, ప్రస్తుతం 270 సర్వీసులనే ఆర్టీసీ నడుపుతోంది. వీటిలో డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి, గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర సర్వీసులున్నాయి. మిగిలిన సర్వీసులనూ ఆర్టీసీ పునరుద్ధరించనుంది. కరోనా కారణంగా ఏసీ సర్వీసులకు ఆదరణ తగ్గింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వాటికి ఆదరణ పెంచేందుకే ఆర్టీసీ ఈ ఆఫర్‌ ప్రకటించింది. 

ఆక్యుపెన్సీ 70 శాతానికి పైగా చేరేలా ప్రణాళికలు 
ఆర్టీసీలో 3,078 నాన్‌ ఏసీ దూర ప్రాంత సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ఒక్కో బస్సులో పది శాతం సీట్లకే 10 శాతం రాయితీ వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ శాతం 70కి పైగా చేరేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ప్రయివేట్‌ ట్రావెల్స్‌కు దీటుగా ప్రయాణికులకు సేవలందించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించినట్టు ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.   

మరిన్ని వార్తలు