Giri Grama Darshini: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు

20 Aug, 2022 14:14 IST|Sakshi
గత జూన్‌లో గిరిజన సంప్రదాయ వివాహ పద్ధతిలో మరోమారు మనువాడిన సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ దంపతులు

అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ 

పర్యాటకులకు పూర్తి ఆదివాసీ జీవన విధాన అనుభూతి

గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో వివాహాలకు అవకాశం

సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే.

గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచా­రాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది.

గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్‌ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్‌)

అక్కడే పెళ్లి చేసుకోవచ్చు
గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్‌ సొసైటీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు.

ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్‌ ఫైర్‌ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం)

మరిన్ని వార్తలు