వదంతులు నమ్మవద్దు 

15 Jun, 2021 04:42 IST|Sakshi

విద్యుత్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత ఆలోచనే లేదు 

పాత పీఆర్‌సీనే కొనసాగుతుంది 

ఉచిత విద్యుత్‌కు ఖరీఫ్‌ నుంచి వంద శాతం ఫీడర్లు రెడీ 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఆలోచన చేయడం లేదని, ఈ ప్రచారం వదంతులేనని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వదంతులతో ఉద్యోగులు అభద్రతకు లోనుకావద్దని కోరారు. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడం లేదన్నారు. ఖరీఫ్‌ నుంచి వందశాతం ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన సోమవారం విద్యుత్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణాన్నే ఆకాంక్షిస్తోందని, వారికి నష్టం చేసే ఏ ఆలోచన చేయబోదని భరోసా ఇచ్చారు. 2018లో సవరించిన వేతనాలే 2022 వరకు కొనసాగుతాయని, ఈ విషయాన్ని వారికీ స్పష్టం చేశామని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్‌ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రెండు నెలల్లో అందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. 

రైతు కోసం ఎంతైనా ఖర్చు 
రైతు పక్షపాతి అయిన సీఎం వైఎస్‌ జగన్‌ ఉచిత విద్యుత్‌ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్క అనంతపురంలో మాత్రం రైతుల కోరిక మేరకు రాత్రిపూట విద్యుత్‌ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 55 శాతం ఫీడర్లే 9 గంటల పగటి విద్యుత్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో అప్పటికప్పుడే రూ.1,700 కోట్లు మంజూరు చేసి సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను బలోపేతం చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రూ.80 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రూ.18 వేల కోట్ల చేయూతతో విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు అడుగులేశారని చెప్పారు.

ప్రైవేటీకరణ యోచన లేదు 
విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడంలేదని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన దాఖలాలు లేనేలేవన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపుసెట్లకు మీటర్లు బిగించి, కచ్చితమైన విద్యుత్‌ వినియోగాన్ని లెక్కగట్టామని, ఒక్క రైతుపైనా పైసా భారం మోపలేదని చెప్పారు. రైతు ఖాతాల్లోకే వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీని వేశామని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్‌ అందించే దిశగా డిస్కమ్‌ల్లో జవాబుదారీతనం పెరిగిందని పేర్కొన్నారు. 

వ్యవసాయ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ 
పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జగనన్న కాలనీల్లో నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు