అయ్యవారికి అరటి గెల.. తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే..

24 Jun, 2022 19:24 IST|Sakshi

టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): భీష్మ ఏకాదశి పర్వదినం.. చెట్లతాండ్ర అనే గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసన. యువకులు గెలలు లెక్క పెడుతున్నారు. వంద దాటాయి.. వెయ్యి దాటాయి.. సమయం గడుస్తోంది గానీ లెక్క తేలడం లేదు. గెలలన్నీ పూర్తయ్యే సరికి వచ్చిన లెక్క ఎనిమిది వేలు.
చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే!

ఎనభై ఏళ్ల కిందట ఊరిలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అరటి గెలలు కడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున గెలలు కట్టినా ఎన్నడూ లెక్కలో పొరపాటు రాలేదు. అసలు ఈ అరుదైన సంప్రదాయం ఎలా మొదలైంది.? ఆలయ నిర్మాణం వెనుక విశేషాలేంటో తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాలి.

సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర. పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేవు. అన్ని పల్లెల్లాగానే సా దాసీదా గ్రామం. కానీ ఇక్కడ ప్రతి ఇంటిలో నిర్వహించే శుభ కార్యానికి ముందు పరావస్తు అయ్యవారికి మొదట పూజలు నిర్వహించి ఆ తర్వా తే పనులు మొదలుపెడతారు. 170 ఏళ్ల కిందట ఈ ఊరికి వచ్చిన స్వామీజీ పేరే పరావస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే.

అయ్యవారు జీవ సమాధిగా మారిన స్థలానికి ఆనుకుని నిర్మాణం చేసిన లక్ష్మీ నృసింహస్వామి ఆలయం 

ఇప్పటికి 170 ఏళ్ల కిందట.. ప్రస్తుతం నౌపడ ఆర్‌ఎస్‌.. అప్పట్లో రాళ్లపేట రైల్వే స్టేషన్‌లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మరి వృత్తిదారులు కుండలు అమ్మడానికి వెళ్లారు.  పరావస్తు అయ్యవారు అనే స్వామి వారి వద్దకు వెళ్లి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో కుమ్మరి వృత్తిదారులు స్వామిని గ్రామానికి తీసుకువచ్చారు.

అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించేవారు. గ్రామం చుట్టుపక్కల సత్సంగాలు నిర్వహించే వారు. ఈతి బాధలు ఉన్న వారికి స్వామి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందేవారు. ఇలా 45 ఏళ్ల పాటు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నేళ్లూ ఆయన వద్ద ఉన్న అక్షయ పాత్ర ద్వారా ప్రసాదాలు ఇచ్చే వారని భక్తులు చెప్పుకునేవారు.

పరావస్తు అయ్యవారు జీవసమాధిగా మారిన స్థలంలో పుట్టిన   మర్రిచెట్టు 

45 ఏళ్ల కైంకర్యాల తర్వాత ఆయన అక్కడే జీవ సమాధి పొందారు.  ఆయన జీవ సమాధిగా మారిన ప్రదేశంలో కొద్ది రోజులకే మర్రి చెట్టు పుట్టింది. దీంతో ఆ మర్రిచెట్టు అయ్యవారికి ప్రతిరూపంగా భావించారు. ఆ తర్వాత గ్రామం మధ్యలో సుమారు ఎకరా స్థలాన్ని కేటాయించి  లక్ష్మీ నృసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదట్లో వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించేవారు.

రోజు రోజుకూ భక్తులు ఆరాధన పెరుగుతుండడంతో 80 ఏళ్ల కిందట అరటి గెలలను కట్టడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం  ఇప్పటికీ కొనసాగుతోంది. మొదట్లో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు మాత్ర మే అరటి గెలలు కట్టేవారు. ఆ తర్వాత జిల్లాలు, రాష్ట్రాలు దాటి భక్తులు ఇక్కడకు చేరుకుని అరటి గెలలు కట్టడం ప్రారంభించారు. అరటి గెలల సంఖ్య పదుల నుంచి వేలకు చేరింది. ఈ  ఏడాది నిర్వహించిన భీష్మ ఏకాదశి ఉత్సవాలకు ఏకంగా 8 వేలకుపై చిలుకు అరటి గెలలు కట్టారు.

ఒక్కటీ మిస్‌ కాదు
చెట్లతాండ్ర గ్రామంలో గల పరావస్తు అయ్యవారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆవరణలో భక్తులు వేల సంఖ్యలో అరటి గెలలు కడుతుంటారు. అయితే తిరిగి అరటి గెలలు తీసుకునే క్రమంలో ఏ ఒక్క అరటి గెల కూడా మిస్‌ కాదు. గ్రామంలో యువకులంతా ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. మూడు రోజుల తర్వాత కొంత మంది భక్తులు అరటి గెలలను ఇంటికి తీసుకువెళ్తారు. మరి కొంత మంది స్వామి వద్దనే ఉంచేస్తారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఏ రోజూ అరటి గెలలు పోయాయి అనే మాట రాలేదని ఉత్సవాల కమిటీ సభ్యులు చెబుతున్నారు.

చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. 
మా ఊరిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యవారి సన్నిధిలో అరటి గెలల మహోత్సవాన్ని చూస్తున్నాను. ఏటా భక్తులు పెరుగుతున్నారు.  
-పి.జగ్గయ్య, చెట్లతాండ్ర,  సంతబొమ్మాళి మండలం. 

బాధ్యతగా ఉంటాం 
మా గ్రామంలో ఏటా భీష్మ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు పరావస్తు అయ్యవారు లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో ఎంతో బాధ్యతగా ఉత్సవాలు నిర్వహిస్తాం. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువకులంతా సమష్టిగా పనిచేస్తారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తాం. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. 
-పి.అసిరినాయుడు, సర్పంచ్, చెట్లతాండ్ర

మరిన్ని వార్తలు