శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం..

20 Jun, 2022 15:39 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి  తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా రెండురోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఆదివారం రైతుపై దాడి చేసి గాయపరిచింది. సోమవారం రోజు స్థానికులు అప్రమత్తతో ఉన్నప్పటికీ మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది. భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలుగు బంటి సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. క్షతగాత్రులకు కార్పొరేట్‌ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలుగుబంటిని అదుపుచేసేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు