ఆరోగ్యంతో ఆటలొద్దు.. నాన్‌ వెజ్‌పై నజర్‌ అవసరం!

12 Sep, 2022 09:12 IST|Sakshi

అనంతపురం నాల్గో రోడ్డులో రమేష్‌ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం వీరింటికి బంధువులొచ్చారు. చాలా రోజులకు ఇంటికి రావడంతో ప్రత్యేక వంటకాలతో వారిని సంతోష పెట్టాలని.. రమేష్‌ స్థానికంగా ఉండే ఓ మటన్‌ దుకాణానికి వెళ్లి కేజీ పొట్టేలు మాంసం తెచ్చి భార్యతో కూర చేయించాడు. ఏమైందో తెలియదు.. తిన్న కొద్దిసేపటికీ వారందరికీ ఒకటే విరేచనాలు. ఆస్పత్రికి వెళ్లి రూ. వెయ్యి ఖర్చు చేస్తే గానీ ఉపశమనం లభించలేదు. అనంతపురంలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మాంసం దుకాణాలు ప్రజల ఆరోగ్యాలను 
గుల్ల చేస్తున్నాయి.
  

రాయదుర్గం: పెళ్లయినా, ఇతర ఏ ఫంక్షన్‌ అయినా ప్రస్తుత రోజుల్లో నాన్‌వెజ్‌ అంటేనే ప్రజలు ఉత్సాహం చూపుతారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరకడంతో మాంసాహారంపై మరింత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటినా ఆదివారమొస్తే కచ్చితంగా తినాల్సిందేనంటున్నారు. అయితే, దీన్నే అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ దుకాణాలు ఇష్టానుసారంగా నెలకొల్పి అపరిశుభ్ర వాతావరణంలో కార్యకలాపాలు సాగిస్తూ వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.  

నిబంధనలు ఇలా..  
కబేళాలు, మాంసాహార దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏర్పాటు చేసిన కబేళా (స్లాటర్‌ హౌజ్‌)ల్లోనే జీవాలను వధించాలి. వధించే ముందు పశువైద్యాధికారి జీవాలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. వధించిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విక్రయించేందుకు వీలుగా మెడ భాగంలో ధ్రువీకరణ ముద్ర వేస్తారు. వినియోగదారులు ఆ ముద్రను చూసి కొనుగోలు చేస్తే కొంత భరోసా ఉంటుంది.  

జరుగుతోంది ఇలా.. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు. కొన్నింటిని కబేళాల్లో వధిస్తున్నా.. పశు వైద్యాధికారి ధ్రువపరచడం లేదు. మరికొందరైతే దుకాణాల ఆవరణలోనే వధిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అయితే పట్టించుకునే వారే లేరు.  అటు స్థానిక అధికారులు, ఇటు పశు సంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు తెరుస్తున్నారు. పలు వ్యాధులతో చనిపోయిన జీవాలను సైతం ఎక్కడో వధించి తీసుకొస్తూ ప్రజలకు కట్టబెట్టేస్తున్నారు. ఆరోగ్యాలను హరిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలా చోట్ల ఉన్న కబేళాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నిబంధనలు పక్కాగా అమలు చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూర్చినట్లవుతంది.   

నెలకోసారి కొంటాం 
పెద్దల సాంప్రదాయ ప్రకారం ఇంట్లో కోడి మాంసం వండటం లేదు. దీంతో మేక, పొట్టేలు మాంసం కొనాల్సి వస్తోంది. పెద్ద కుటుంబం కావడంతో మూడు కిలోలు కొంటాం. ధర తక్కువ ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు కొని తిన్నాం. ప్రస్తుతం నెలకు ఒకసారి కూడా తెచ్చుకోలేని పరిస్థితి.   
– బోయ శివన్న, రైతు, రంగచేడు  

కమిషనర్లకే చర్యలు తీసుకునే అధికారం 
కబేళాల ఏర్పాటు, మాంసం నాణ్యతగా ఉండేలా చూడడం, అపరిశుభ్రత ఉంటే చర్యలు తీసుకోవడం తదితర చర్యలు చేపట్టే అధికారం మున్సిపల్‌ కమిషనర్లకు ఉంది. మాకు సమాచారం ఇస్తే వైద్యాధికారులు వెళ్లి జీవం ఎలా ఉందో ధ్రువీకరిస్తారు. ప్రాథమిక పరీక్షల్లోనే ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుంది. అవసరమైతే వధించిన తర్వాత జీవాల పరీక్షలకు ల్యాబ్‌ కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్యంగా ఉండే మాంసం విక్రయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. లేదంటే కఠిన చర్యలు చేపడతాం.   – ఏవీ రత్నకుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ, అనంతపురం  

నాణ్యతలేని మాసం విక్రయిస్తే కఠిన చర్యలు 
రాయదుర్గంలో అధికారికంగా జంతుశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం మార్కెట్‌ వద్దే స్థలం కేటాయించి వ్యాపారాలు చేపట్టేలా ఆదేశాలిచ్చాం. అక్కడ కాకుండా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు సాగిస్తున్నట్టు మా దృష్టికి వస్తున్నాయి. మూగజీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా..? లేదా అని పశు వైద్యులు గుర్తించాకే వధించాల్సి ఉంటుంది. వ్యాధుల బారిన పడ్డ, మృతి చెందిన వాటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేలా సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేస్తాం.   – దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్, రాయదుర్గం  

మరిన్ని వార్తలు