టీడీపీ సోషల్‌ మీడియా అత్యుత్సాహం

11 Sep, 2023 04:39 IST|Sakshi

రిమాండ్‌ను తిరస్కరించినట్టు ఐటీడీపీ ట్వీట్లు 

పలుచోట్ల సంబరాలు చేసుకున్న నేతలు 

జడ్జి రిమాండ్‌ విధించడంతో ఒక్కసారిగా మౌనం

సాక్షి, అమరావతి: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు అరెస్ట్‌పై వాదోపవాదాలు నడుస్తున్న సమయంలో టీడీపీ సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో చెలరేగిపోయింది. జడ్జి ఎటువంటి నిర్ణయం చెప్పకుండానే మధ్యాహ్నం 2 గంటల నుంచి చంద్రబాబు రిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని విపరీతంగా ప్రచారం చేశాయి.

ఐటీడీపీకి చెందిన కార్యకర్తలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియాల్లో రిమాండ్‌ను తిరస్కరించినట్టు పోస్టులు కూడా పెట్టి వైరల్‌ చేశారు. ఇంకా జడ్జి తీర్పు వెల్లడించలేదని తెలిసి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఇష్టానుసారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో అంతటా గందరగోళం నెలకొంది. చంద్రబాబు ఇంటికి వెళ్లిపోతారని, కోర్టులో ఆయనకు అనుకూలంగా నిర్ణయం ఉందనే భావన వచ్చేలా చేశారు. కొన్నిచోట్ల అయితే టపాసులు కాల్చడం, స్వీట్లు పంచడం కూడా చేశారు. పలుచోట్ల సంబరాలకు నేతలు సిద్ధమయ్యారు.

చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించి బయటకు వచ్చి విక్టరీ గుర్తు చూపించడంతో దాన్ని వైరల్‌ చేస్తూ చంద్రబాబు ఇంటికి వెళ్లిపోతారనే ప్రచారం చేశారు. కోర్టు నుంచి చంద్రబాబు నేరుగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళతారని అక్కడ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాయి. చివరకు చంద్రబాబుకు జడ్జి రిమాండ్‌ విధించడంతో ఒక్కసారిగా ఎల్లో మీడియా, ఐటీడీపీ సైలెంట్‌ అయిపోయాయి. 

మరిన్ని వార్తలు