పక్కా కుట్రతోనే స్కిల్‌ దోపిడీ

11 Sep, 2023 04:42 IST|Sakshi

కుట్రదారు చంద్రబాబే.. డబ్బు చేరింది ఆయనకే.. 

బాబు ఆదేశంతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల

షెల్‌ కంపెనీలు, ఫేక్‌ ఇన్వాయిస్‌లతో రూ.241 కోట్లు దోపిడీ

అచ్చెన్నాయుడు సహకారం

నిధుల తరలింపులో లోకేశ్‌ కీలక పాత్ర

రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ సిట్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి  :  ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రాజెక్ట్‌ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ, కుట్ర పూరితంగా షెల్‌ కంపెనీలు సృష్టించి ఫేక్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి రూ.371 కోట్లను అక్రమంగా తరలించారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం.. ప్రాజెక్టు చేపట్ట­కుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయడం.. షెల్‌ కంపెనీల ద్వారా తరలించడం.. ఇలా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.

ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నా­గంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ సృష్టికర్త.. ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధి­దారూ రెండూ చంద్రబాబే’ అని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్‌ చేసిన చంద్రబాబును ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా 29 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌ను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించింది.

అవినీతి కుంభకోణాన్ని పూర్తిగా వెలికి తీసి, దోషులను శిక్షించేందుకు సమగ్ర దర్యాప్తు సాఫీగా సాగాలంటే చంద్రబాబుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించాలని కోరింది. ‘గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుతోపాటు ఇతర నిందితులు 38 మంది సహకారంతో చంద్రబాబు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్‌ కీలక పాత్ర పోషించారు’ అని వెల్లడించింది. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే..

దోచేందుకే ప్రాజెక్ట్‌..
యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజా­ధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్‌ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ను సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం లేకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేశారు. సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌బోస్, డిజైన్‌ టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్‌ ఈ కుట్రలో భాగస్వాముల­య్యారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీమెన్స్‌–డిజైన్‌టెక్‌ కంపెనీలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీకి డైరెక్టర్‌గా తన సన్నిహిడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారా­యణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బా­రావును నియమించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్‌ ప్రైజస్, ఇన్నోవేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్‌ కంపెనీ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్‌ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300 కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమో­దించి.. అందులో సీమెన్స్‌–డిజైన్‌టెక్‌ కంపెనీలు 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొ­న్నారు. 

నిధులు ఇచ్చేయండని చంద్రబాబు ఆదేశం
ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీ వాటా 10 శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్‌ ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్‌ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు.

లోకేశ్‌దీ కీలక పాత్ర 
షెల్‌ కంపెనీల ద్వారా నిధులు ముంబయి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి చేర్చడంలో ఆయన తనయుడు నారా లోకేశ్‌ కీలక పాత్ర పోషించారు. లోకేశ్‌ తన సన్నిహితుడు కిలారు రాజేశ్‌ ద్వారా ఆ నిధుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఫైళ్లు మాయంటీడీపీ హయాంలోనే 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణాన్ని గుర్తించారు.  

పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను జప్తు చేశారు. వాటిలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్‌లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు.

నిధులు కొల్లగొట్టేందుకుగ్రీన్‌ చానల్‌
ఆ ప్రాజెక్ట్‌ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి నేరుగా ఎంటర్‌ప్రైజస్‌– ఇన్నోవేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్‌ టెక్‌ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.279 కోట్లను యోగేశ్‌ గుప్తా మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్‌లలోని షెల్‌ కంపెనీలకు తరలించారు.

అనంతరం షెల్‌ కంపెనీల కమీషన్లు మినహాయించుకుని హవాలా మార్గంలో, బ్యాంకు నుంచి డ్రా చేసి మొత్తం రూ.241 కోట్లను షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి ముంబయిలో అందించారు. ఆ నగదును మనోజ్‌ పార్థసాని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. ఆయన ఆ రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.

కస్టడీలో విచారించాల్సినఅవసరం ఉంది
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం మాస్టర్‌ మైండ్‌ చంద్రబాబుకు అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే సిట్‌ విచారణ కోసం నోటీసులు జారీ చేసిన యోగేశ్‌ గుప్తా, మనోజ్‌ పార్థసాని విదేశాలకు పరారయ్యారు. మిగిలిన సాక్షులను కూడా చంద్రబాబు బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను అరెస్టు చేశాం. ఆయన బయట ఉంటే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశాలున్నాయి. అందువల్ల ఆయనకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు