మనసున్న ప్రభుత్వం మనది 

24 Nov, 2023 05:32 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ది తక్షణమే ఆదుకునే స్వభావం  

త్వరలో గత ప్రభుత్వ డీజిల్‌ బకాయిల విడుదల  

మత్స్యకారుల లాంగ్‌లైనర్‌ బోట్లకు 75% రాయితీ  

మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు  

బోట్ల దగ్ధం బాధితులకు రూ.7.11 కోట్ల పరిహారం చెల్లింపు  

ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే చెక్కులు అందజేత   

సాక్షి, విశాఖపట్నం: మనసున్న ప్రభుత్వం మనదని,  బాధి­తు­ల­ను తక్షణమే ఆదుకునే స్వభావం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి­దని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నెల 19 అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగి­న అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 49 బోట్ల యజమానులకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 కోట్ల 11 లక్షల 76 వేల నష్ట పరిహారాన్ని గురువారం జిల్లా పరిషత్‌ హాల్లో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే నష్టంలో 80 శాతం సొమ్మును పరిహారంగా అందజేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు.

ప్రమాదంలో కాలిపోయిన బోట్లలో పనిచేస్తున్న సుమారు 400 కలాసీ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిపారు. బాధిత మత్స్యకారుల్లో సీఎం జగన్‌ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారని, ఇలాంటి నేత దేశంలోనే లేరని ప్రశంసించారు. రూ.80 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అయ్యే లాంగ్‌లైనర్‌(పెద్ద) బోటు కొనుగోలుకు ఇప్పుడున్న 60 శాతం సబ్సిడీని 75కి పెంచుతూ త్వరలో జీవో జారీ చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు ఈ పరిహారం సొమ్మును లాంగ్‌లైనర్‌ బోట్ల పెట్టుబడి సొమ్ముగా వినియోగించాలని సూచించారు.

ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమన్నారు. గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపానులకు దెబ్బతిన్న బోట్లకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, దీంతో ఆయన హామీలన్నీ నీటిమీద రాతలేనన్న భావనలో మత్స్యకారు­లున్నా­రని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకా­రులకు పాత డీజిల్‌ సబ్సిడీ బకాయి సుమారు రూ.5.50 కోట్లను రెండు వారాల్లో చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోరిక మేరకు బయో డీగ్రేడబుల్‌ ఆయిల్‌కు కూడా సబ్సిడీ ఇస్తామని, సంబంధిత బంకుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. 

సీఎం జగన్‌ చలించిపోయారు: వైవీ సుబ్బారెడ్డి 
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని­ప్రమాదంపై సీఎం జగన్‌ చలించిపోయారని, దగ్ధమైన బోట్లకు బీమా ఉందా లేదా అన్నది చూడకుండా మత్స్యకారులు నిలదొ­క్కుకునేలా ఆదుకోవడం మన బాధ్యత అని, అందుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని చెప్పారని తెలిపారు. ఈ సాయంతో వారు కొత్త బోట్లు కొనుగోలుకు వీలవుతుందన్నారు.

చిన్న బోట్లతో పాటు పెద్ద బోట్ల యజమానులు బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని మరపడవల సంఘం రాష్ట్ర అధ్య­క్షు­డు వాసుపల్లి జానకీరామ్‌ తన దృష్టికి తెచ్చారని, ఆ మేరకు తాను కృషి చేస్తానని, బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గత తుపాన్లకు దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.6 లక్షలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని, వారికీ న్యాయం జరిగేలా ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2019 మే నుంచి సెప్టెంబర్‌ వరకు డీజిల్‌ సబ్సిడీ చెల్లించేలా చూస్తామని చెప్పారు.

ఇంతలా స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరు..: మోపిదేవి 
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లా­డుతూ బాధిత మత్స్యకారులు ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌­దే­న­న్నారు. ఇంతలా పెద్ద మనసుతో స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ హుద్‌హుద్‌ తుపానుకు దెబ్బతిన్న 34 బోట్లకు పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు చుట్టూ తాను ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజు, రీజనల్‌ కోఆర్డినేటర్‌ సుబ్బారెడ్డిలు బోట్ల యజమానులకు చెక్కులను అందజేశారు.

సభలో మత్స్యకారులు జై జగన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పేర్ల విజయచందర్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు