Vodarevu Fishing Harbour: హార్బర్‌ తీరానికే దర్బార్‌..

26 Aug, 2022 18:48 IST|Sakshi

రూ.532 కోట్లతో వాడరేవులో నిర్మాణానికి ప్రతిపాదనలు

టెండర్లు ఆహ్వానించిన మారిటైం బోర్డు

రూ.408 కోట్లతో పనులు దక్కించుకున్న విశ్వసముద్ర

మరికొద్దిరోజుల్లో పనులు ప్రారంభం

తీరప్రాంత అభివృద్ధికి వడివడిగా అడుగులు

అలలపై ఆరాటం.. బతుకు నిత్యపోరాటం.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు తెచ్చిన మత్స్యసంపద అమ్మకానికీ జంఝాటం.. ఇదీ తరతరాలుగా బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గంగపుత్రుల దైన్యం. వీరి తలరాతలు మార్చేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. త్వరలో పనులు ప్రారంభం కానుండడంతో ఊరూవాడ సంబరపడుతున్నాయి. 


సాక్షి, బాపట్ల/చీరాల: 
మత్స్యకారులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో మైళ్ల దూరం వెళ్లి వేటాడిన మత్స్యసంపద దళారుల పరమవుతోంది. నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్‌ స్టోరేజీలు, ఎండబెట్టుకునేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలు లేకపోవడంతో మద్రాసు ఏజెంట్లు చెప్పిన ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీనికితోడు ఏటా వచ్చే ప్రకృతి విపత్తులకు రూ.లక్షలు పెట్టి కొన్న పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. ఈ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని చీరాల మండలం వాడరేవు వాసులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు వీరి కలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే హార్బర్‌ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి.   


పదేళ్ల క్రితమే సర్వే జరిగినా..  

వాడరేవు హార్బర్‌ నిర్మాణానికి 2012లోనే సర్వే నిర్వహించారు. అప్పట్లోనే మినీ హార్బర్, ఫ్లోటింగ్‌ జెట్టి నిర్మించాలని నిర్ణయించినా.. ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడరేవులో హార్బర్‌ నిర్మాణంపై దృష్టి సారించింది. దీనికోసం ఏపీ మారిటైమ్‌ బోర్డు రూ.532 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించింది. ఆ పక్రియలో విశ్వసముద్ర ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ ఏజెన్సీ రూ.408.42 కోట్లతో టెండర్లను దక్కించుకుంది. ప్రస్తుతం 20 ఎకరాలు అవసరం ఉండగా 13 ఎకరాల వరకు రెవెన్యూ శాఖ అప్పగించింది. మిగిలినది భూసేకరణ ద్వారా తీసుకోనున్నారు. హార్బర్‌ నిర్మాణానికి 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 80 శాతం నిధులు కేంద్ర మత్స్యమౌలిక అభివృద్ధి సంస్థ, నాబార్డు మంజూరు చేస్తాయి.   


నిజాంపట్నం హార్బర్‌ ఉన్నా..  

ప్రస్తుతం వాడరేవులో హార్బర్‌ లేకపోవడంతో సముద్రంలో వేటాడిన మత్స్యసందపను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం లేదు. దీంతో కాకినాడ, చెన్నై ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నిజాంపట్నంలో హార్బర్‌ ఉన్నా సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో చీరాల వాడరేవు నుంచి కాకినాడ గానీ చెన్నై గానీ వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఫలితంగా మత్స్యసంపద దళారుల పాలవుతోంది. దళారులు మత్స్యసంపదను తక్కువ ధరకు కొని చెన్నై, బెంగళూరు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. (క్లిక్‌: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం)

ప్రయోజనాలివీ..  
► హార్బర్‌ నిర్మాణం పూర్తయితే 890 ఇంజిన్‌ బోట్లు, 350 మెకనైజ్డ్‌ బోట్లు, 75 చిన్న ఓడలు సురక్షితంగా నిలుపుకునే అవకాశం ఉంటుంది.  
► స్థానికంగానే మత్స్య సంపదను మార్కెటింగ్‌  చేసుకోవచ్చు.  
► ఒంగోలు, నెల్లూరు, నిజాంపట్నం నుంచి బోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.  
► స్థానిక మత్స్యకార మహిళలకు సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది.  
► జిల్లాలోని తీరప్రాంతం అభివృద్ధి చెందుతుంది.   


జిల్లాకే తలమానికం    

హార్బర్‌ నిర్మాణం పూర్తయితే వాడరేవు జిల్లాకే తలమానికంగా మారుతుంది. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నా హయాంలో హార్బర్‌ నిర్మాణ పనులు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మరోనెలలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతాం. దీనికితోడు వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నేషనల్‌ హైవే మంజూరైంది. త్వరలో ఆ పనులూ ప్రారంభం కానున్నాయి.   
– కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే, చీరాల  


మరో నెలలో పనులు  

హార్బర్‌ నిర్మాణం ఎంతో మేలు చేస్తోంది. మత్స్యసంపదకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సరుకు ఎండబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫాంలు, నిల్వ ఉంచుకునేందుకు ఏసీ స్టోరేజ్‌లు, డీజీల్‌ బంకులు, రవాణాకు రోడ్లు అందుబాటులోకి వస్తాయి. మరో నెలలో హార్బర్‌ పనులు ప్రారంభమవుతాయి.
– డాక్టర్‌ పి.సురేష్, మత్య్సశాఖ జాయింట్‌ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు