ముళ్లకంపలో మానవత్వం.. ఊపిరి పోసే ‘ఊయల’ 

7 Dec, 2021 13:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొందరు కసాయిలు దయాదాక్షిణ్యాలను మరచిపోతున్నారు.. కడుపు తీపిని చంపేసుకుంటున్నారు.. కన్నపేగును తెంపేసుకుంటున్నారు.. అభం శుభం తెలియని శిశువుల ఉసురు తీసేస్తున్నారు.. ఆడపిల్ల పుట్టిందని కొందరు.. వివాహేతర సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు ఇంకొందరు.. పోషణ భారమై మరికొందరు బిడ్డలను రోడ్డుపాలు చేస్తున్నారు.. కనికరం లేకుండా కుప్పతొట్టిలో వదిలేస్తున్నారు .. మానవత్వం మరచి ముళ్లకంపల్లోకి విసిరేస్తున్నారు.. సమాజంలో తలెత్తిన వికృత పోకడలను అరికట్టేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. మనిషి కర్కశత్వానికి బలైన అనాథ చిన్నారులను ‘ఊయల’ పథకంతో ఆదుకుంటోంది. పసి ప్రాణాల ఆలనాపాలనా చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. విద్యాబుద్ధులు నేరి్పంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. చిరుశ్వాసను చిదిమేయకుండా ‘ఊయల’లోకి చేర్చాలని కోరుతోంది.

సాక్షి, తిరుపతి: అనాథ శిశువులకు ప్రభుత్వం అభయమిస్తోంది. పసి ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. పురిటి బిడ్డలను చెత్తకుండీలు, ముళ్లపొదల పాలు చేసేవారు కాస్త మానవత్వంతో ఆలోచించి ఊయల పథకాన్ని వినియోగించుకోవాలని సూచిస్తోంది. అలాంటి శిశువుల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటామని తెలియజేస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పీహెచ్‌సీల, ఏరియా ఆస్పత్రుల వద్ద 45 ఊయలలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.35లక్షలను వెచ్చించింది. 

అక్కున చేర్చుకుంటూ.. 
ఊయల్లో పడుకోబెట్టిన అనాథ శిశువులను ప్రభుత్వమే అక్కున చేర్చుకుని సంరక్షిస్తుంది. ఇందుకోసం జిల్లాలలోని శిశువిహార్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు కొందరు మహిళలను నియమించింది. వారి చదువు సంధ్యలను ప్రభుత్వమే చూసుకుంటుంది. ఉన్నత విధ్యను అభ్యసించిన వారికి ఉద్యోగావకాశాలను సైతం కల్పించాలని నిర్ణయించింది. 

అనాథ పిల్లల సంరక్షణే లక్ష్యం 
అనాథ పిల్లల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఊయల పథకం ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఊయలలు ఏర్పాటు చేశాం. మరి కొన్నిప్రాంతాల్లో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. పసిబిడ్డలను పడేయకుండా ఊయలలో వేస్తే వారిని బాధ్యతగా పెంచుతాం.  – నాగశైలజ, ఐసీడీఎస్‌ పీడీ, చిత్తూరు 

పేరూరు కట్టపై శిశువు మృతదేహం 
తిరుపతి క్రైం: కన్ను తెరవని పసిగుడ్డు.. తల్లి పేగు తెంపిన నెత్తుటి మరకలు ఆరలేదు.. పురిటి వాసన పోలేదు.. పేరూరు కట్టపై ఆడ శిశువు నిర్జీవంగా పడి ఉంది. తొమ్మిది నెలలు మోసిన అమ్మకు భారమైపోయిందో.. నేలన పడగానే ఊపిరి ఆగిపోయిందో.. ఆడబిడ్డని ఉసురు తీసేశారో తెలియదు.. ఊయలూగాల్సిన పసికందు మృతదేహాన్ని చెరువు కట్టపై పడేశారు.

ఒక వేళ మృత శిశువుగా జన్మించినా అంత నిర్దయగా అంతిమ సంస్కారం కూడా నిర్వహించకుండా ముళ్ల పొదల్లోకి విసిరేయడం చూపరుల హృదయాలను కలచివేసింది. తిరుపతి–చంద్రగిరి జాతీయ రహదారి సమీపంలోని పేరూరు కట్టపై సోమవారం ఉదయం ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ దీపిక ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.  
 

మరిన్ని వార్తలు