‘క్లాప్‌’ కొట్టాల్సిందే!

17 Jun, 2021 03:38 IST|Sakshi

గ్రీన్‌ అంబాసిడర్లుగా పారిశుధ్య కార్మికులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు ఇక పరిశుభ్రంగా మారనున్నాయి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరణ.. జియోట్యాగింగ్‌ చేసిన ఆటోలతో వ్యర్థాల తరలింపు.. గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు.. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు.. వ్యర్థాల నుంచి విద్యుత్, కంపోస్ట్‌ ఎరువుల తయారీ.. వెరసి రాష్ట్రంలోని 123 నగరాలు, పట్టణాలు 100 శాతం పరిశుభ్రంగా రూపుదిద్దుకోనున్నాయి. తద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడనుంది. పరిశుభ్రతే లక్ష్యంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని జూలై 8న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పురపాలకశాఖ సన్నద్ధమవుతోంది. ఓవైపు పూర్తిస్థాయిలో మౌలిక వసతులను సమకూర్చుకుంటూ మరోవైపు ప్రజలను భాగస్వాములుగా చేసుకుని కార్యాచరణ రూపొందించింది. క్లాప్‌ కార్యక్రమంలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిని గ్రీన్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి గ్లౌజులు, కళ్లద్దాలు, బూట్లుతో పీపీఈ కిట్ల వంటి సూట్‌ ఇవ్వనుంది. వారి ఆరోగ్య పరిరక్షణతోపాటు సామాజిక గౌరవాన్ని పెంపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 

రూ.100 కోట్లతో కోటికిపైగా డస్ట్‌బిన్లు
నగరాలు, పట్టణాల్లో రోడ్లు, వీధుల్లో వ్యర్థాలు కనిపించకూడదన్నది క్లాప్‌ కార్యక్రమం లక్ష్యం. అందుకు ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరిస్తారు. ఇళ్ల నుంచే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తారు. ఆ విషయంపై వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, స్వచ్ఛందసంస్థల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పురపాలకశాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదేశాలతో స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్‌ ఎండీ సంపత్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి పురపాలక, మెప్మా సిబ్బందికి శిక్షణా తరగతులు ప్రారంభించారు. తడిచెత్త కోసం పచ్చరంగు, పొడిచెత్త కోసం నీలం రంగు, ప్రమాదకర చెత్త కోసం ఎర్ర రంగు డస్ట్‌బిన్‌లను ఉచితంగా సరఫరా చేస్తారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున సరఫరా కోసం కోటికిపైగా డస్ట్‌బిన్‌లను కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం 15వ ఆర్థికసంఘం నిధులు రూ.100 కోట్లను పురపాలకశాఖ వెచ్చించనుంది.

3,100 డీజిల్‌ ఆటోలు, 1,800 ఈ–ఆటోలు
ఇళ్ల నుంచి వ్యర్థాల తరలింపునకు ఇప్పటివరకు ఉన్న తోపుడు బళ్ల స్థానంలో ఆటోలను ప్రవేశపెడతారు. 45 పెద్ద మునిసిపాలిటీల్లో ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక డీజిల్‌ ఆటో చొప్పున మొత్తం 3,100 ఆటోలు ఏర్పాటు చేస్తారు. 78 చిన్న మునిసిపాలిటీల్లో ప్రతి 700 ఇళ్లకు ఓ ఈ–ఆటో వంతున మొత్తం 1,800 ఆటోలను ప్రవేశపెడతారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌తో ఉన్న ఆటోలకు రెండు వైపులా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ ఆటో ఏ ప్రాంతంలో ఉందో అధికారులు పర్యవేక్షించవచ్చు. 

121 వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు
జీటీఎస్‌ నుంచి వ్యర్థాలను వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లకు తరలిస్తారు. 123 నగరాలు, పట్టణాల్లో 121 వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు నెలకొల్పుతారు. ఇప్పటికే 31 వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. 18 ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోంది. మరో 72 ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. విశాఖపట్నం, గుంటూరుల్లో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతారు. మిగిలిన వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. రెండుదశల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

రూ.160 కోట్లతో 225 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు 
ఇంతవరకు వ్యర్థాలను వీధులు, కాలనీల్లో ఓ ప్రదేశంలో పెద్ద చెత్తకుండీల్లోను, బయట వేస్తున్నారు. ఆ వ్యర్థాలు చెల్లాచెదురై అనారోగ్య పరిస్థితులు ఏర్పడేవి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు (జీటీఎస్‌లు) ఏర్పాటు చేయనుంది. ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను ఆటోలలో తరలించి ఈ జీటీఎస్‌లలో వేస్తారు. అందుకోసం ప్రతి 10 వార్డులకు ఒక జీటీఎస్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా రూ.160 కోట్లతో నగరాలు, పట్టణాల్లో మొత్తం 225 జీటీఎస్‌లు నెలకొల్పుతారు. రూ.13 కోట్లతో 4 వేల కంపాక్టర్‌ బిన్‌లను కొనుగోలు చేసి జీటీఎస్‌లలో అందుబాటులో ఉంచుతారు. 

మరిన్ని వార్తలు