AP CM YS Jagan: గౌతమ్‌ సంగం బ్యారేజీ

9 Mar, 2022 03:34 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం జగన్‌

నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు

6 వారాల్లో పూర్తి చేసి ప్రారంభిస్తాం

రాజమోహన్‌రెడ్డి మూడు కోరికలనూ నెరవేరుస్తాం 

పారిశ్రామిక దిగ్గజాల రాక వెనుక గౌతమ్‌ కృషి చాలా ఉంది

భజాంకాలు, బంగర్‌లు, సంఘ్వీ, ఆదిత్య బిర్లాలు తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు

నేను కాంగ్రెస్‌ను వీడాక నాతో కలిసి నడిచిన అతి కొద్ది మందిలో గౌతమ్‌ ఒకరు

నా స్నేహితుడి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం 

గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో స్వయంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెడతామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని, యుద్ధ ప్రాతిపదికన మంత్రి అనిల్‌ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసి మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజీ అని పేరు పెట్టి ప్రారంభిస్తామన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌ తమ చిరకాల అనుబంధాన్ని, మంత్రివర్గ సహచరుడి మంచి పనులను గుర్తు చేసుకున్నారు.
 
మూడు కోరికలను నెరవేరుస్తాం..
గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరిన వాటిని నెరవేరుస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (మెరిట్స్‌) కళాశాలకు గౌతమ్‌ పేరు పెట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు అనువైన బోధనా కాలేజీగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఆ కాలేజీని ప్రభుత్వం తీసుకుని ఆయన ఆశించినట్లుగానే గౌతమ్‌ పేరుతో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సులను ప్రవేశపెట్టి ఉత్తమ కాలేజీగా తీర్చిదిద్దుతామన్నారు. 

ఉదయగిరికి తొలిదశలోనే నీరు
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని రెండో దశలో కాకుండా మొదటి దశలోకి తెచ్చి పనులు వేగంగా పూర్తి చేసి ఉదయగిరి ప్రాంతానికి నీళ్లివ్వాలని రాజమోహన్‌రెడ్డి చాలా భావోద్వేగంగా అడిగారని, అది కూడా కచ్చితంగా నెరవేరుస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ మొదటి దశలోకి తీసుకువచ్చి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ఉదయగిరి డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపరచాలని కోరారని, నాడు–నేడు రెండో దశలో ఆ కళాశాలకు మెరుగులు దిద్దుతామన్నారు. రాజమోహన్‌రెడ్డి కోరిన మూడు అంశాలను కచ్చితంగా చేస్తామని ఈ సభ ద్వారా భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.

ఆ ఊహే కష్టంగా ఉంది
తన సహచరుడు, చిరకాల మిత్రుడు, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేడన్న ఊహే ఎంతో కష్టంగా ఉందని, ఇది రాష్ట్రానికి కూడా తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. గౌతమ్‌ తనకు చిన్నతనం నుంచి స్నేహితుడని, తన కంటే వయసులో ఒక సంవత్సరం పెద్దవాడైనా తనను అన్నగా భావించేవాడని గుర్తు చేసుకున్నారు. తనను అంత విశ్వసించి, తనపై అంత నమ్మకముంచేవాడన్నారు. తనకేం కావాలి...? తనకేం నచ్చుతుందోనని తపించేవాడని చెప్పారు. అలాంటి ఒక మంచి స్నేహితుడిని, ఎమ్మెల్యేని పోగొట్టుకున్నానని, గౌతమ్‌ ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. గౌతమ్‌ ఉన్నత చదువులు చదివాడని, యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడకి వచ్చాడని తెలిపారు.

కాంగ్రెస్‌ను వీడాక నా వెంటే నిలిచారు..
నాడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాను తొలుత బయటకు అడుగులు వేసినప్పుడు గౌతమ్‌ రాజకీయాల్లో లేడని, ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డి అప్పట్లో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారని సీఎం జగన్‌ చెప్పారు. తాను ఈ స్థానానికి వస్తానని ఆ రోజుల్లో బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చన్నారు. కాంగ్రెస్‌తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకి వచ్చినప్పుడు అతి తక్కువ మంది తనతోపాటు ఉండటానికి సాహసించారని తెలిపారు. అలాంటి కొద్ది మంది వ్యక్తులలో గౌతమ్‌ ఒకరని గుర్తు చేసుకున్నారు. గౌతమ్‌ ప్రభావం ఆయన తండ్రిపై ఉందన్నారు. రాజమోహన్‌రెడ్డి తనతో నిలబడటానికి గౌతమ్‌తో తనకున్న స్నేహం, విశ్వాసం, తాను చేయగలననే నమ్మకం ప్రధాన కారణాలన్నారు.మేకపాటి కుటుంబమంతా తన వెంట నడిచిందని, అలాంటి స్నేహితుడ్ని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు.

పట్టుబట్టి పెట్టుబడులు..
వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్‌రెడ్డి కేబినెట్‌లో ఆరు శాఖలకు ప్రాతినిధ్యం వహించి సమర్థంగా పనిచేశారని సీఎం జగన్‌ కొనియాడారు. దుబాయ్‌ ఎక్స్‌పోకు వెళ్లేముందు కూడా తనను కలిశారని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, తాను కలుసుకున్న పారిశ్రామికవేత్తల వివరాలను తనకు తెలియచేయాలని కోరుతూ రోజూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరాలు పంపేవారని తెలిపారు. పరిశ్రమలపరంగా రాష్ట్రాన్ని ముందెన్నడూ లేని విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. 

గౌతమ్‌ కృషితో పారిశ్రామిక దిగ్గజాల రాక
గతంలో ఎన్నడూ లేనివిధంగా పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించడం వెనుక మంత్రి గౌతమ్‌రెడ్డి కృషి ఎంతో ఉందని సీఎం జగన్‌ తెలిపారు. సెంచురీ ఫ్లైవుడ్‌ కడప జిల్లా బద్వేలులో రావడంతోపాటు బంగర్‌లు.. శ్రీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారని చెప్పారు. బజాంకాలు, బంగర్‌లు, సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వీ, ఆదిత్య బిర్లా తమ హయాంలోనే రాష్ట్రంలో అడుగుపెడుతున్నారన్నారు. అదానీలు కూడా తమ హయాంలోనే రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. వారి పేర్లను గతంలో పత్రికల్లో చదవడమే మినహా మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదన్నారు.

వారందరికీ భరోసా కల్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో గౌతమ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. గౌతమ్‌ భౌతికంగా మన మధ్య లేకున్నా తన కలలు, తన ప్రాంతానికి మంచి జరగాలన్న కోరికను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. పైలోకంలో ఉన్న గౌతమ్‌ను దేవుడు చల్లగా చూస్తాడని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. మేకపాటి కుటుంబానికి తామంతా ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

మరిన్ని వార్తలు