పెద్ద కంపెనీలతో అనుసంధానం ముఖ్యం

4 Sep, 2020 18:17 IST|Sakshi

ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

నెదర్లాండ్‌ ప్రభుత్వం, 8 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై ప్రభుత్వం దృష్టి

సాక్షి, అమరావతి: ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమని, లేని పక్షంలో మార్కెటింగ్‌ సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి అంశాల్లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ చాలా ముఖ్యం అన్న ఆయన, దీని కోసం కంపెనీలతో అనుసంధానం చేసిన తర్వాతనే ముందడుగు వేయాలని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని నిర్దేశించారు. జిల్లాల్లో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్‌ ల్యాబుల్లో అంతర్భాగంగా ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు చేయాలని సూచించారు. (చదవండి: ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌)

రైతులు తరచుగా ఇబ్బందులు పడుతున్న 7, 8 ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయాలని, ఆ ప్రాసెసింగ్‌  సెంటర్లలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఆక్వా రంగం రైతులకూ మేలు జరగాలని, వారి ఉత్పత్తులకు తగిన ధరలు లభించాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్‌  మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎమ్వీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. (చదవండి: సీఎం జగన్‌ కృషితో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్..)

ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు..
సమీక్షా సమావేశం అనంతరం ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై నెదర్లాండ్‌ ప్రభుత్వం, 8 కంపెనీలతో  ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అరటి, టమోటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో నూతన టెక్నాలజీ, కొత్త ఉత్పత్తుల తయారీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. పంట చేతికి వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధానాలు, అందులో టెక్నాలజీ అంశాలను కంపెనీలు వివరించారు.

అరటికి సంబంధించి ఎన్‌ఆర్‌సీ బనానా తిరుచ్చితో ఒప్పందం జరిగింది. కొత్త మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రమోషన్‌తో పాటు క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబరేటరీలపై వారు పని చేస్తారు. ఎన్‌ఆర్‌సితో ఒప్పందంపై ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శివ, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సురేష్‌కుమార్‌ సంతకాలు చేశారు. డ్రై చేసిన అరటి ఉప ఉత్పత్తిని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దాని తయారీ విధానంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానంపై సమావేశంలో సమగ్రంగా వివరించారు. 

అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై పుణెకు చెందిన ఫ్యూచర్‌టెక్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై సీఎం వైఎస్‌ జగన్‌కు కంపెనీ సీఈఓ అజిత్‌ సోమన్ వివరాలు అందించారు. వాక్యూమ్‌ టెక్నాలజీ ఉపయోగాలను ఆయన వివరించారు.

టమోటా, అరటి ప్రాసెసింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై బిగ్‌ బాస్కెట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ జోనల్‌ హెడ్‌ కె.రామచంద్ర కిరణ్‌ ఆ ఎంఓయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అనంతపురంలో ప్రాసెసింగ్‌ చేస్తున్నామన్న ఆయన, కలెక్షన్‌ సెంటర్లపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. 

మామిడి, చీనీ, మిరప వంటి పంటల ప్రాసెసింగ్‌పై ఐటీసీతోనూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.కృష్ణకుమార్‌ ఆ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ (లీప్‌) కంపెనీ సీఈఓ విజయ రాఘవన్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉల్లి ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. 

ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్‌ ప్రభుత్వంతో, ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో న్యూఢిల్లీనుంచి భారత్‌లో నెదర్లాండ్స్‌ అంబాసిడర్‌ మార్టెన్‌ వాన్‌ డెన్‌ బెర్గ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌ ప్రతినిధి శాన్నీ గీర్డినా క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు. 

రొయ్యలు, చేపల పెంపకంలో టెక్నాలజీ, మార్కెటింగ్‌ తదితర అంశాలపై ఐఎఫ్‌బీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. రొయ్యలు, చేపలు ఎగుమతి, రిటైల్‌ మార్కెటింగ్‌పై అంపైర్‌ కంపెనీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ ఫుడ్‌ కార్పొరేషన్‌ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, మత్స్య శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఆయా ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశాయ్‌ ఫ్రూట్స్‌ కంపెనీ నుంచి అజిత్‌ దేశాయ్, తిరుచ్చి ఎన్‌ఆర్‌సీబీ నుంచి డాక్టర్‌ ఉమ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు