కొబ్బరి దింపు.. ఉండదిక జంకు

11 May, 2021 03:28 IST|Sakshi
అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువకులు

‘కొబ్బరి వృక్షమిత్ర’లతో కాయల దింపు సమస్యకు చెక్‌

శిక్షణ ఇస్తున్న అంబాజీపేట పరిశోధనా కేంద్రం

గ్రామీణ యువతకు ఉపాధి 

రైతులకు తగ్గుతున్న ఖర్చు

సాక్షి, అమరావతి: కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి నేలకు దించే (కొబ్బరి దింపు) విషయంలో రైతులు పడే వెతలు అన్నీఇన్నీ కావు. కొబ్బరి దింపు కార్మికులకు ఆదాయం తక్కువగా ఉండటం.. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు ఉండటం లేదు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిష్కారం చూపుతోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపుతోంది.

‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ
కొబ్బరి చెట్టుపైకి సునాయాసంగా ఎక్కగలిగే పరికరాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీబీడీ) రూపొందించింది. ఈ పరికరం ఆధారంగా కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయల్ని కోసి దించడంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ ఇస్తోంది. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగి 7వ తరగతి వరకు చదివిన యువతీ, యువకులను కొబ్బరి వృక్ష మిత్రలుగా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దించడం, కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణ, ఎరువులు, పురుగుల మందుల ఉత్తమ యాజమాన్య పద్ధతులపై తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి చొప్పున 6 రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కోసం ఉద్యాన వర్సిటీ రూ.1,06,500 ఖర్చు చేస్తోంది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రూ.2,500 విలువ గల చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 26 బ్యాచ్‌లుగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పట్టణానికి చెందిన 520 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. తాజాగా అంబాజీపేట పరిశోధనా కేంద్రం సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విశాఖ జిల్లా అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా కలికిరి, కృష్ణా జిల్లా గరికిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా (కేవీకే) శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు.

దింపు కార్మికులకూ పెరుగుతున్న ఆదాయం
సాధారణంగా సంప్రదాయ కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30నుంచి 40 చెట్ల కాయల్ని దించగలరు. అదే శిక్షణ పొందిన వృక్ష మిత్రలైతే 70నుంచి 80 చెట్ల కాయలను దించగలుగుతున్నారు. సంప్రదాయ దింపు కార్మికులు రోజుకు రూ.300 సంపాదిస్తుండగా.. వృక్షమిత్రలు రోజుకు రూ.500 కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. 

శిక్షణ పొందాలనుకుంటే..
ఆసక్తి గల నిరుద్యోగులు ఎంతమంది ముందుకొచ్చినా శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. శిక్షణ పొందగోరే అభ్యర్థులు అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌ 08856–243847 లేదా ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌బీవీ చలపతిరావు (సెల్‌: 83095 38808)ను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సమీపంలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. స్థానికంగా ఉపాధి పొందగోరే యువత మాత్రమే కాకుండా కొబ్బరి తోటలు పెంచే రైతులు సైతం శిక్షణ పొందవచ్చు.

నేనే దింపు తీసుకుంటున్నా
నాకు మూడెకరాల కొబ్బరితోట ఉంది. దింపు సమస్యతో చాలా ఇబ్బందిపడే వాడిని. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ పొందా. ఇప్పుడు కార్మికులపై ఆధారపడకుండా నా తోటలో నేనే స్వయంగా కాయలు దింపుకోగలుగుతున్నా. దీనివల్ల నెలకు రూ.2 వేలకు పైగా మిగులుతోంది. 
– మట్టపర్తి వెంకట సుబ్బారావు, శిక్షణ పొందిన రైతు

రోజుకు రూ.500 సంపాదిస్తున్నా
నేను కూలీ పనులు చేసుకునే వాడిని. రోజూ రూ.300కు మించి ఆదాయం వచ్చేది కాదు. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా ఇచ్చిన పరికరం సాయంతో సులభంగా కొబ్బరిచెట్లు ఎక్కి కాయల్ని దింపు తీస్తున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా.
– నెల్లి నవీన్, కొబ్బరి వృక్షమిత్ర, గంగలకుర్రు, తూర్పు గోదావరి

సమయం.. పెట్టుబడి కలిసొస్తుంది.
నాకు పదెకరా>ల కొబ్బరి తోట ఉంది. దశాబ్దాలుగా దింపు సమస్య ఎదుర్కొన్నా. శిక్షణ పొందిన కొబ్బరి వృక్షమిత్రలు రావడంతో దింపు కోసం ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సమయం, పెట్టుబడి కూడా కలిసి వస్తోంది.
– చేకూరి సూర్యనారాయణ, డైరెక్టర్, కృషివల కోకోనట్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీ

దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం
విశ్వవిద్యాలయం ద్వారా అంబాజీపేట పరిశోధనా కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. శిక్షణ సందర్భంగా సాగులో యాజమాన్య మెళకువలపైనా తర్ఫీదు ఇస్తున్నాం. కొబ్బరి వృక్ష మిత్రల రాకతో కొబ్బరి దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
– డాక్టర్‌ టి.జానకిరామ్, వైస్‌ చాన్సలర్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు