మా బంగారు కొండే..

2 Jul, 2023 09:44 IST|Sakshi

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): జిల్లాలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారుకొండ పథకం సత్పలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత అన్నారు. శనివారం స్థానిక ఐదుబండ్ల మార్కెట్‌ సమీపంలో రేలంటి ఇవాంశిక అనే చిన్నారి ఇంటిని ఆమె సందర్శించారు. తాను  దత్తత తీసుకున్న ఈ బాలికను కలెక్టర్‌ ఎత్తుకుని కొద్దిసేపు ముచ్చటించారు. వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తహీనతతో బాధపడుతుండటంతో ఇవాంశికను బంగారుకొండ పథకం కింద కలెక్టర్‌ ఎంపిక చేసుకుని దత్తత తీసుకున్నారు.

రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద బలవర్థకమైన ఆహారం, బాలామృతం, కోడిగుడ్లను చిన్నారికి క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. బంగారుకొండ కిట్‌ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్న తీరు పట్ల కలెక్టరు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా డాక్టర్ల సలహా మేరకు తగిన విధంగా పర్యవేక్షిస్తుండటంతో 10 రోజుల వ్యవధిలో కేజీ బరువు పెరిగింది. రెండు అంగుళాల పొడవు కూడా పెరగడం గమనించినట్లు మాధవీలత పేర్కొన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్‌ 7.5 శాతం నుంచి 9.5 శాతానికి పెరింగిందని అధికారులు తెలిపారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆరు నెలలు నిండి ఆరేళ్ల లోపు 1293 మంది పిల్లలను బంగారుకొండ కింద గుర్తించామని కలెక్టరు తెలిపారు. ప్రతి బుధవారం బాలమిత్రలు చిన్నారుల ఇంటికి వెళ్లి  ఆహార పదార్థాలు, ఆరోగ్య వివరాలు పర్యవేక్షిస్తారన్నారు. బంగారుకొండ కిట్‌  పౌష్టికాహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలన్నారు. ప్రతి నెలా ఒక కిట్‌ ఇవ్వడం ద్వారా ఆరు నెలలు పాటు పర్యవేక్షిస్తామన్నారు. ఇవాంశికలో చక్కటి పురోగతి కనిపించడంతో ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. జిల్లా శిశుసంక్షేమ .. సాధికారిత ఇన్‌చార్జి అధికారి,డీఆర్‌డీఏ పీడీ సిరిపురపు సుభాషిణి, అంగనవాడీసూపర్‌వైజర్,వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు