మల్టీ డిసిప్లినరీ అటానమస్‌ సంస్థలుగా కాలేజీలు

20 Mar, 2022 05:47 IST|Sakshi

డిగ్రీలు ప్రదానం చేసే వర్సిటీలుగా ఎదిగేలా ముసాయిదా ప్రతిపాదనలు

పరిశ్రమలతో అనుసంధానం ద్వారా కొత్త కోర్సులు 

ఇతర కాలేజీలతో భాగస్వామ్యం ద్వారా డ్యూయల్‌ మేజర్‌ డిగ్రీ కోర్సులు 

యూనివర్సిటీల తరహాలో దేశంలోని అన్ని కాలేజీలు మల్టీ డిసిప్లినరీ (బహుశాస్త్ర మిశ్రిత) అటానమస్‌ సంస్థలుగా ప్రగతి సాధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఉన్నందున దేశంలోని కాలేజీలు కూడా ఆ స్థాయికి చేరేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించింది. వీటిపై మార్చి 20లోగా దేశంలోని నిపుణులు, ఇతర స్టేక్‌ హోల్డర్లు తమ అభిప్రాయాలు వెల్లడించాలని యూజీసీ పేర్కొంది. పరిశోధనలు చేయించడంతో పాటు, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, డిగ్రీలను ప్రదానం చేసే అటానమస్‌ సంస్థలుగా కాలేజీలు రూపుదాల్చేలా చర్యలు చేపట్టనుంది. పారిశ్రామిక భాగస్వామ్యం, రీసెర్చ్‌ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు యూనివర్సిటీల స్థాయికి చేరుకోవడమే ఈ ముసాయిదా ప్రతిపాదనల లక్ష్యమని యూజీసీ వివరించింది.
– సాక్షి, అమరావతి 

2035 నాటికి అన్ని కాలేజీలూ స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా.. 
2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది వీటి ఉద్దేశం. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని యూజీసీ నిర్దేశించింది. అలాగే నాలుగేళ్ల డ్యూయల్‌ మేజర్‌ డిగ్రీ ప్రోగ్రాములను అమలు చేసేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే అంశాలను కూడా ఈ ప్రతిపాదనల్లో యూజీసీ చేర్చింది.

భాగస్వామ్య విధానంలో విద్యార్థులు తాము చేరే సంస్థలో ఒక డిగ్రీ తీసుకోవడంతో పాటు సెకండ్‌ డిగ్రీని ఆ సంస్థతో ఒప్పందమున్న వేరే ఉన్నత విద్యాసంస్థలో పొందేందుకు వీలుగా ఆయా సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం రెగ్యులేటరీ సంస్థల నియమాలను అనుసరిస్తూ జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ కోర్సులకు ఎంపికను కూడా సంబంధిత అర్హత పరీక్షల ఆధారంగానే చేపట్టాలి. భాగస్వామ్య సంస్థలు నిర్దేశించిన కనీస అర్హత మార్కులను ఆయా విద్యార్థులు సాధిస్తేనే సెకండ్‌ డిగ్రీతో డ్యూయల్‌ డిగ్రీకి అవకాశం ఉంటుంది.

క్లస్టర్లుగా కాలేజీలు 
ఇందుకోసం కాలేజీలను ఒక క్లస్టర్‌గా రూపొందించి వాటిమధ్య పరస్పర సహకారం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఉన్నత విద్యాసంస్థ అన్ని కోర్సులను నిర్వహించడానికి వీలైన వనరులను ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ఆ సంస్థల మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఏర్పాటు, నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా వాటిలో చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో క్లస్టర్‌ కాలేజీ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కాలేజీల్లో చేరికలు పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని యూజీసీ పేర్కొంటోంది. భాగస్వామ్య విధానం వల్ల ఆయా సంస్థలు వనరులు సమకూర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, అదే సమయంలో విద్యార్థులకూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీసీ అభిప్రాయపడుతోంది. న్యాక్‌ అక్రిడిటేషన్,  ఇతర గుర్తింపులను కూడా ఆయా సంస్థలు సాధించడానికి వీలుంటుందని యూజీసీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు