సమగ్ర భూ సర్వే అమలుకు మంత్రుల కమిటీ

15 Jul, 2021 02:16 IST|Sakshi

సభ్య కార్యదర్శిగా మంత్రి పెద్దిరెడ్డి

సభ్యులుగా డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి బొత్స

సమర్థ అమలు, పురోగతిపై వారానికోసారి సమీక్ష

ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష (సమగ్ర భూ సర్వే) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యుటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్య కార్యదర్శిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సమగ్ర భూ సర్వే మరింత ఉధృతంగా, సమర్థవంతంగా అమలు, పురోగతిపై మంత్రుల కమిటీ వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సర్వే పురోగతితో పాటు ఏమైనా సమస్యలుంటే సమీక్షించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రుల కమిటీకి అప్పగించారు. పురోగతితో పాటు తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.      

 

మరిన్ని వార్తలు