ఫీడ్‌ ధరలకు ముకుతాడు

25 Sep, 2023 04:52 IST|Sakshi

టన్నుకు రూ.256 వరకు పెంచేందుకు యత్నించిన కంపెనీలు

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అప్సడా 

పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చర్యలు

సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్‌) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఫీడ్‌ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్‌ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్‌ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది.

గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం
ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్‌ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్‌ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీడ్‌ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది.

ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్‌ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. 

సీఎం జగన్‌ ఆదేశాలతో..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమా­వేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతి­పాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదే­శాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీ­ఎఫ్‌తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్‌ చైర్మన్, అప్సడా 
 

మరిన్ని వార్తలు